One Ticket To Travel Across Country: ఒక్క టిక్కెట్‌తో దేశమంతా రైలు ప్రయాణం : సర్క్యులర్ జర్నీ ట్రైన్ టికెట్
Telugu News: మీరు తీర్థ యాత్ర చేయాలనుకుంటున్నారా..? వేరు వేరు స్టేషన్లలో టికెట్లు తీసుకోవడం సమస్యగా ఉందా..? అయితే ఈ సర్క్యులర్ జర్నీ ట్రైన్ టికెట్ మీకోసమే..
‘దేశమంతటా ఓ సారి ట్రిప్ వేయాలని ఉందండీ..’ చాలా మంది, చాలా సార్లు , చాలా మందితో చెప్పే మాటిది. కానీ ఎంతమంది ఈ కోర్కెని తీర్చుకుంటారు. ‘అమ్మో చాలా వ్యయ, ప్రయాసలతో కూడుకున్న పని.. పెద్ద ప్లానింగ్ అవసరం’ అని ఆగిపోతారు. కచ్చితంగా అలాంటి వాళ్లకోసమే ఇండియన్ రైల్వేస్ చాలా కాలం క్రితమే ‘సర్క్యులర్ జర్నీ ట్రైన్ టికెట్’ పేరిట ‘ప్రీ ప్లాన్డ్ ట్రిప్స్’ ప్లాన్ తీసుకొచ్చింది. ఫ్లెక్సిబుల్ రూట్ ఆఫ్ జర్నీస్‌తో దేశంలోని వివిధ ప్రధాన స్టేషన్ల నుంచి వివిధ రాష్ట్రాల్లోని ఎనిమిది పర్యాటక ప్రదేశాల వరకు చుట్టి రావొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే దేశమంతటా చుట్టేసిన ఎక్స్‌పీరియన్స్ అతి తక్కువ ఖర్చుతో వస్తుంది. అంతే కాదండీ.. స్టేషన్ స్టేషన్‌కి రిజర్వేషన్ చేయించే అవసరం కూడా లేదు. ప్రాపర్ ప్లాన్ ఉంటే.. అదిరిపోయే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు కావాల్సిన అన్ని సాయాలూ... ఇండియన్ రైల్వేస్ చేస్తుంది.
ఏంటీ సర్క్యులర్ జర్నీ ట్రైన్ టికెట్..
సాధారణంగా ట్రైన్ టికెట్ రెండు స్టేషన్ల మధ్య తీసుకుంటాం. కానీ ఈ సర్క్యులర్ జర్నీ ట్రైన్ టికెట్‌తో మాత్రం దేశంలోని ప్రధాన స్టేషన్ల నుంచి రెండు వేల నుంచి 8 వేల కిలో మీటర్ల మేర దూరం ఉన్న ఎనిమిది వేరు వేరు పర్యాటక ప్రాంతాలకు జర్నీ చేయొచ్చు. ఆయా స్టేషన్ల మధ్య ఫిక్స్‌డ్ ట్రయిన్లకు వెళ్లాల్సిన పనేమీ లేదు. ఏ ట్రైన్ అందుబాటులో ఉంటే ఆ ట్రయిన్ ఎక్కొచ్చు. అత్యధికంగా 56 రోజుల పాటు పనిచేసే ఈ టికెట్‌తో దేశమంతా తిరగొచ్చు.
ఉదాహరణకు
విజయవాడ నుంచి బయల్దేరి.. తిరుపతి- మన్మడ్- వీరవల్- ద్వారక- ఉజ్జయిన్- ఢిల్లీ- రిషికేష్- పూరి ఇదంతా చుట్టి తిరిగి విజయవాడ వస్తే ఇదో సర్కులర్ జర్నీ ప్లాన్. మొత్తం 8268 కిలోమీటర్లు చుట్టి రావచ్చు. అలాగే అదే విజయవాడ నుంచి పూరి- వారణాసి- అయోధ్య-నైమిశరణ్యం-రిషికేష్- ఢిల్లీ- మథుర- ఆగ్రా-విజయవాడ ఇది మరో సర్క్యులర్ జర్నీ ప్లాన్.. 5067 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్లాన్ కూడా విజయవాడ నుంచే అందుబాటులో ఉంది. ఇలాగే హైదరాబాద్ నుంచి భద్రాచలం రోడ్- తిరుపతి- పాండిచ్చేరి- రామేశ్వరం- తిరుచేందూర్- కన్యాకుమారి- మైసూర్- హుబ్లీ- హైదరాబాద్ ఇదీ దాదాపు 5 వేల కిటోమీటర్ల మేర ఉన్న టూర్ ప్లాన్. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, రాజమండ్రి, గుంతకల్, అనకాపల్లి వంటి స్టేషన్ల నుంచి ఒక్కో స్టేషన్ నుంచి రెండు మూడు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనికోసం ఇండియన్ రైల్వేస్ వివిధ స్టేషన్ల నుంచి ప్రత్యేక ప్లాన్స్ తీసుకొచ్చింది. సెంట్రల్ రైల్వేస్ నుంచి 20 ప్లాన్లు, నార్తర్న్ రైల్వేస్ నుంచి పది ప్లాన్లు, సౌతర్న్ రైల్వేస్ నుంచి 31 ఫిక్స్ డ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
ఈ టికెట్‌ని ఆన్లైన్‌లోనో, టికెట్ కౌంటర్‌లోనే తీసుకునేందుకు వీలుండదు. ముందుగా మనం వెళ్లాలనుకున్న ప్లాన్‌ను డిసైడ్ చేసుకోవాలి. ఏ స్టేషన్ నుంచి వెళ్లాలనుకుంటున్నామో ఆ స్టేషన్ కు చెందిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌ను సంప్రదించాలి. ఆయన మీరు వెళ్లాలనుకున్న రూట్‌ని బట్టీ మీరు ఎంచుకున్న క్లాస్‌లొ ప్రయాణానికి ఎంత ఖర్చవుతుందో నిర్ణయిస్తారు. దానికి సంబంధించిన లెటర్‌రు సంబంధిత స్టేషన్ మేనేజర్‌కి పంపిస్తారు. సంబంధిత స్టేషన్ మేనేజర్ నుంచి ఈ సర్క్యులర్ జర్నీ ట్రైన్ టికెట్ కొనుక్కోవచ్చు. ఆ తరువాత రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి సంబంధిత రూట్‌లో ఉన్న ఏ స్టేషన్ నుంచైనా ఏ ట్రైన్‌కైనా ఈ 56 రోజుల్లో ఎప్పుడైనా ఎంచుకున్న క్లాస్ ప్రకారం సీట్లు బుక్ చేసుకోవచ్చు.
వీటికి ధరను మొత్తం రూట్ అంతటికీ కాకుండా.. మొదటి చివరి స్టేషన్‌ల ఆధారంగా అప్ అండ్ డౌన్ రెండు జర్నీలుగా పరిగణించి టికెట్ ధర నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రయాణించే టికెట్ కంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఫిక్స్‌డ్ ప్లాన్లే కాకుండా.. మనం తిరగాలనుకున్న ప్రాంతాలను ఎనిమిదికి మించకుండా ప్లాన్ చేసుకుని డివిజినల్ కమర్షియల్ మేనేజర్‌కి చెప్తే వాటికి కూడా టికెట్లు ఇస్తారు. ఇంకెందుకాలస్యం కాశీ నుంచి కన్యాకుమారి వరకు కావల్సిన చోటకి తిరిగేయండి.