మా అనుమతి లేకుండా రెండో పెళ్లి చేసుకుంటామంటే కుదరదు - ఉద్యోగులకు ప్రభుత్వం వార్నింగ్
Assam govt: తమ అనుమతి లేకుండా ఉద్యోగులెవరూ రెండో పెళ్లి చేసుకోడానికి వీల్లేదని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది.
Assam Govt Marriage:
అసోం ప్రభుత్వం ఉత్తర్వులు..
అసోం ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పెళ్లైన ఉద్యోగులెవరైనా సరే తమ అనుమతి లేకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. జీవిత భాగస్వామి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించి పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై ప్రత్యేకంగా Office Memorandum విడుదల చేసింది. విడాకులకు సంబంధించిన నిబంధనల్ని ఇందులో ప్రస్తావించకపోయినా...ప్రభుత్వం అనుమతి లేకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై మాత్రం ఆంక్షలు విధించింది.
"ప్రభుత్వ ఉద్యోగులెవరైనా సరే అప్పటికే పెళ్లైన వాళ్లు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదు. జీవిత భాగస్వామి బతికి ఉన్నప్పుడు మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే కచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. వ్యక్తిగత చట్టాల పేరు చెప్పుకుని తప్పించుకోలేరు. ఇది మగవాళ్లకే కాదు. ఆడవాళ్లకూ వర్తిస్తుంది. ప్రభుత్వం అనుమతి లేకుండా మహిళలు ఎవరూ రెండో పెళ్లి చేసుకోకూడదు"
- ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్
కంపల్సరీ రిటైర్‌మెంట్..
అక్టోబర్ 20 వ తేదీన ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. Assam Civil Services Rules 1965 లోని రూల్ 26 ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలకైనా వెనకాడం అని స్పష్టం చేసింది. భారీ జరిమానాతో పాటు కంపల్సరీ రిటైర్‌మెంట్ తీసుకునేలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. లీగల్‌గానూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
భారత్‌లో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉండటం చట్టరీత్యా నేరం. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఇందుకు సమ్మతి లభించదు. అటు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమూ...ఇది నేరంగానే పరిగణిస్తారు. ఒకసారి పెళ్లైన పురుషుడు ఆమెని కాదని మరో మహిళను పెళ్లి చేసుకోవడం కుదరదు. బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తారు. Indian Penal Codeలోని సెక్షన్ 494,సెక్షన్ 495 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. అయితే...ముస్లిం చట్టంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇస్లాం మతానికి చెందిన పురుషులు నలుగురు మహిళలను పెళ్లి చేసుకునేందుకు సమ్మతి ఉంటుంది. కాకపోతే...వాళ్లందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది.