Special Parliamentary Session: ప్రశ్నోత్తరాలు లేకుండానే ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు!
Special Parliamentary Session: సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు లేకుండానే జరుగనున్నాయి
Special Parliamentary Session: సెప్టెంబర్ 18 నుంచి 22 తేదీ వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ల నుంచి శనివారం అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెషన్‌లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. సభ్యులు విడిగా తాత్కాలిక క్యాలెండర్‌ని అందుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి 17వ లోక్‌సభ పదమూడో సమావేశాలు ప్రారంభమవుతాయని సూచిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 18న సోమవారం సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు సభ్యులకు సమాచారం ఇస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సమావేశాలపై ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజ్యసభ రెండు వందల అరవై ఒకటో సెషన్ సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం ప్రారంభమవుతుందని, ఈ మేరకు సభ్యులకు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. గురువారం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సమావేశాల అజెండాను రహస్యంగా ఉంచారు. దీంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి.
"సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. అమృత్ కాల్‌లో భాగంగా పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం" అంటూ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో చెప్పారు. రాజ్యాంగంలో ప్రత్యేక సెషన్ అంటూ స్పెషల్‌గా నిర్వచించలేదు. పార్లమెంటరీ లేదా జాతీయ మైలురాళ్లను స్మరించుకోవడం వంటి నిర్దిష్ట సందర్భాలలో ప్రభుత్వం ఇటువంటి సెషన్‌లను గతంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా, ప్రతి సంవత్సరం బడ్జెట్, వర్షాకాలం, శీతాకాలం అంటూ మూడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించటం రాజకీయంగా కలకలం రేపుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. ఏయే అంశాలపై చర్చించనున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
కానీ ఈ ప్రత్యేక సెషన్ కొత్త పార్లమెంట్ భవనంలో కార్యకలాపాలను ప్రారంభంచడానికి అయ్యి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రత్యేక సెషన్ ప్రస్తుత లోక్‌సభలో చివరిది అనే ఊహాగానాలు వీస్తున్నాయి. ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిండంతో ఈ వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఎంపీల గ్రూప్ ఫొటో కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తుండంతో పై వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం వెనక కారణమేంటన్న చర్చ మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ ప్రత్యేక సమావేశాల్లో దాదాపు 10 కీలక బిల్స్‌ని ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తోంది. వీటిని కచ్చితంగా పాస్ చేసి ఆమోదం పొందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే ఈ బిల్స్ కోసమే ఈ స్పెషల్ సెషన్ పెడుతోందని సమాచారం.
జులై 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ వర్షాకాల సమావేశాలు జరిగాయి. మణిపూర్ అంశంపై రెండు సభలు దద్దరిల్లాయి. విపక్షాలు మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దాదాపు రెండు వారాల పాటు ఈ తీర్మానంపై పార్లమెంట్‌లో వాగ్వాదం జరిగింది. ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టాయి. ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు. మొత్తానికి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడంపై ఆసక్తి పెరుగుతోంది.