FASTag Pass: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్, ఫాస్టాగ్ వార్షిక పాస్ తెస్తున్నట్లు ప్రకటన.. ధర ఎంతంటే
FASTag Annual Pass | రహదారి రవాణా వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారుల సౌలభ్యం కోసం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకొచ్చింది.

FASTag Annual Pass In India: జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వారి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకొస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) బుధవారం వెల్లడించారు. రూ. 3,000 ధరతో కొత్త FASTag-ఆధారిత వార్షిక పాస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది వాణిజ్యేతర వాహనాలకు దేశవ్యాప్తంగా హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. 2025 ఆగస్టు 15 నుంచి వార్షిక ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా జర్నీ చేసేలా ఉండాలని ఈ సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు. .
ఆగస్టు 15 నుంచి అమల్లోకి..
నితిన్ గడ్కరీ ఎక్స్ ఖాతాలో చేసిన ప్రకటనలో ఏముందంటే..“సమస్యా రహిత, ఇబ్బంది లేని హైవే ప్రయాణం కోసం కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. రూ. 3,000 ధరతో FASTag-ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నాం. 2025 ఆగస్టు 15 నుంచి అమలులోకి రానుంది. ఇది యాక్టివేషన్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్‌ల వరకు వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుంది. ఏది ముందుగా పూర్తయితే ఆ కండీషన్ వర్తిస్తుంది. ఈ వార్షిక పాస్ కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్నాం” అని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ముఖ్యమైన ప్రకటన 📢
— నితిన్ గడ్కరీ (@nitin_gadkari) జూన్ 18, 2025
🔹సమస్యా రహిత హైవే ప్రయాణం దిశగా ఒక పరివర్తన చర్యలో భాగంగా, మేము 2025 ఆగస్టు 15 నుండి అమలులోకి వచ్చేలా రూ. 3,000 ధరతో FASTag-ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నాము. ఇది యాక్టివేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్‌ల వరకు చెల్లుబాటు అవుతుంది—ఏది వస్తే అది…
జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహనదారుల ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు తక్కువ ధరకు వార్షిక పాస్ తేవాలని భావించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ పాస్ రోడ్డు రవాణాను డిజిటలైజ్ చేయడం, తరచుగా హైవేలపై ప్రయాణించే వారికి ఆర్థిక ఉపశమనం అందిస్తుంది. తక్కువగా జర్నీ చేసే వారికి మాత్రం ఇది ఎక్కువ ఖర్చులా కనిపించే అవకాశం ఉంది.
రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా అందుబాటులోకి..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్‌ను రాజ్‌మార్గ్ యాత్ర యాప్(Rajmargyatra App)తో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అధికారిక వెబ్‌సైట్‌లలో కనిపించే ప్రత్యేక లింక్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
"వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. ఈ విధానం 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. తక్కువ నగదుతో టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. నాన్ కమర్షియల్ వాహనాలకు వార్షిక పాస్ ద్వారా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది’ అని ఆయన అన్నారు.






















