Nirmala Sitharaman on Muslims: భారత్‌లోనే ముస్లింలకు భద్రత-పెరిగిన జనాభానే రుజువు: నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman on Muslims: ఇస్లామిక్ దేశం పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ముస్లింలకు భద్రత ఎక్కువని, ఇక్కడే వారు మెరుగ్గాజీవిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Nirmala Sitharaman on Muslims: భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై హింస గురించి పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభాలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని, దేశంలో మైనారిటీల జనాభా బాగా పెరిగిందని, వారు తమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి విషయాలపై వ్యాఖ్యానించే వారు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని ఆమె సూచించారు.
పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. పెట్టుబడులను ప్రభావితం చేసే భారతదేశంపై ప్రతికూల పాశ్చాత్య అవగాహన అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు.
పెట్టుబడులను స్వీకరించడానికి ఆసక్తి ఉన్న ప్రాంతాలకు, దేశానికి వెళ్లకుండా నివేదికలు రూపొందించే వ్యక్తుల అభిప్రాయాలను వినడం కంటే భారతదేశంలో ఏమి జరుగుతుందో చూడండి అని మాత్రమే తాను చెబుతాను అని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రత్యర్థి పార్టీలోని ఎంపీలు హోదా కోల్పోతున్నారని, భారతదేశంలోని ముస్లిం మైనారిటీలు హింసకు గురవుతున్నారని పశ్చిమ దేశాల పత్రికల్లో వచ్చిన వార్తలపై సీతారామన్‌ను ప్రశ్నించగా.. ఆమె ఈ మేరకు బదులిచ్చారు.
భారతదేశంలో స్వాతంత్య్రం తర్వాత ముస్లిం మైనారిటీల జనాభా బాగా పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వారు దేశంలో తమ వ్యాపారాలను హాయిగా చేసుకుంటున్నారని, స్కాలర్‌షిప్‌లను పొందుతున్నారని చెప్పారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఉందని వెల్లడించారు. దేశ విభజన సమయంలో 3 కోట్ల 50 లక్షల మంది ముస్లింలు ఉంటే.. ప్రస్తుతం వారి సంఖ్య 20 కోట్లకు చేరిందని తెలిపారు. అయితే పాకిస్తాన్‌లో మైనారిటీల పరిస్థితి మరింత దిగజారుతోందని.. వారి సంఖ్య రోజురోజుకు క్షీణిస్తోందని చెప్పారు. 1950లో పాకిస్థాన్‌లో హిందువుల జనాభా 13% ఉండగా ఇప్పుడు అది 2%కి తగ్గింది. అయితే ఆ విషయంపై ఎవరూ మాట్లాడరని, ప్రశ్నించబోరని నిర్మలా సీతారామన్ ఆవేదన వ్యక్తంచేశారు.
#WATCH | "Union Finance Minister Nirmala Sitharaman responds to a question on 'violence against Muslims' in India and on ‘negative Western perceptions' of India pic.twitter.com/KIT9dF9hZC
— ANI (@ANI) April 11, 2023
పాకిస్థాన్‌లో మైనారిటీపై చిన్న చిన్న ఆరోపణలకు కూడా తీవ్ర అభియోగాలు నమోదు చేయడంతో పాటు, మరణశిక్ష వంటి తీవ్ర శిక్షలు విధిస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. దైవదూషణ చట్టాలు, చాలా సందర్భాలలో వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి ఉపయోగించబడతాయని పేర్కొన్నారు. సరైన విచారణ లేకుండా, జ్యూరీ కింద విచారణ జరపకుండా బాధితులు వెంటనే దోషులుగా నిర్ధారిస్తారని చెప్పారు.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ రెండుగా విడిపోయిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. పాకిస్థాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్నప్పటికీ మన దేశంలో ముస్లింల భద్రతగా జీవిస్తున్నారని వెల్లడించారు. అయితే దాయాది దేశంలో మైనారిటీల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందన్నారు. కొన్ని ముస్లిం వర్గాలు కూడా కనుమరుగయ్యాయని సీతారామన్ అన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ముస్లింల కంటే భారతదేశంలోని ముస్లింలు మెరుగైన జీవన విధానం కలిగి ఉన్నారని ఆమె స్పష్టంచేశారు.
భారతదేశంలో ముస్లింలను బలిపశువులకు గురిచేస్తున్నారనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు ముస్లిం జనాభా తగ్గిపోయిందా? ఏదైనా ఒక మతానికి చెందిన వారి మరణాలు అసమానంగా పెరిగాయా? అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. అటువంటి నివేదికలు రాసే వ్యక్తులు భారతదేశాన్ని సందర్శించాలని ఆమె ఆహ్వానించారు. తాను వారికి ఆతిథ్యం ఇస్తానని తెలిపారు. వారు దేశంలో పర్యటించి తమ అభిప్రాయం నిజమని నిరూపించాలని సూచించారు.