NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు
NIA: జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో 41 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర , కర్ణాటకకు చెందిన పలు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి అధికారులు సోదాలు నిర్వహించారు.
NIA’s Raids In Maharashtra And Karnataka: జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) శనివారం మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka)లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్రలోని పూణె, థానే రూరల్, థానే సిటీ, మీరా భయాందర్‌లలో దాడులు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి అధికారులు సోదాలు నిర్వహించారు. మహారాష్ట్రలో చేసిన సోదాల్లో ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యూల్ కేసుకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసింది.
ఈ సోదాల్లో కీలకమైన పలు పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఐసిస్ ఉగ్రవాదులు కుట్రలకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేసి ఐసిస్‌కు అనుకూలంగా పని చేస్తూ దేశంలో అలజడి రేపేందుకు ఆయుధాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ISIS టెర్రర్ మాడ్యూల్ కేసు,పేలుడు పదార్థాల తయారీలో ప్రమేయం ఉన్న అనుమానితుడు ఆకిఫ్ అతీక్ నాచన్‌ను గత ఆగస్టులో అరెస్టు చేశారు. గత నెలలో ఇదే కేసుకు సంబంధించి ముంబైకి చెందిన తబీష్ నాజర్ సిద్ధిఖీ, పూణేకు చెందిన జుబైర్ నూర్ మహమ్మద్ షేక్ అలియాస్ అబు నుసైబా, అద్నాన్ సర్కార్, థానేకి చెందిన షార్జీల్ షేక్, జుల్ఫికర్ అలీ బరోదావాలాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
3వ తేదీ నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 3వ తేదీ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి.. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నిందితుడు రాహుల్ తానాజీ పాటిల్ అలియాస్ జావేద్, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో వివేక్ ఠాకూర్ అలియాస్ ఆదిత్య సింగ్, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మహేంద్ర, అనుమానితుడు శివాపాటిల్ అలియాస్ నివాసాలపై ఎన్‌ఐఏ బృందాలు దాడులు చేశాయి.
వివేక్ ఠాకూర్ ఇంట్లో కరెన్సీ ప్రింటింగ్ పేపర్లతో పాటు రూ. 6,600 నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వివేక్, శివ పాటిల్ మరి కొందరు కలిసి నకిలీ కరెన్సీని, ప్రింటింగ్ పరికరాలను సేకరించేవారని NIA తెలిపింది. నకిలీ నోట్లు, కరెన్సీ ప్రింటింగ్ పేపర్, ప్రింటర్, డిజిటల్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 24న నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా యాంటీ టెర్రర్ ఏజెన్సీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్‌లలో ఈ సోదాలు నిర్వహించింది.