Vaccination: సీనియర్ సిటిజన్లకు జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు
ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులతోపాటు.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ముందస్తు జాగ్రత్త కొవిడ్-19 టీకాను జనవరి 10 నుంచి ఇవ్వనున్నారు.
ఆరోగ్య, ఫ్రంట్ లైన్ కార్మికులతోపాటు 60 ఏళ్ల పైబడిన వారికి జనవరి 10 నుంచి ముందస్తు జాగ్రత్త.. టీకాలు వేయనున్నారు. ఇప్పటికే రెండు డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొంది, బూస్టర్ డోస్‌కు అర్హులైన వారు కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
'కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు ప్రికాషన్ డోసుకు అర్హులైనవారు.. ఈ డోసు కోసం మళ్లీ కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ప్రికాషనరీ డోసు టీకా షెడ్యూల్స్‌ను జనవరి 8న తెరుస్తాం. శనివారం సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సదుపాయం ఉంటుంది. జనవరి 10 నుంచి నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి కూడా టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.' ఆరోగ్య శాఖ తెలిపింది.
కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క మూడో డోస్‌ను తీసుకునేవారు.. నేరుగా ఏదైనా కొవిడ్-19 టీకా కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అపాయింట్‌మెంట్‌తో టీకాలు వేయడం జనవరి 10 నుంచి.. ప్రారంభమవుతుందని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రికాషన్ కొవిడ్ వ్యాక్సిన్.. గతంలో ఇచ్చిన వ్యాక్సిన్‌గానే ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
'ప్రికాషన్ COVID-19 వ్యాక్సిన్ మోతాదు గతంలో ఇచ్చిన అదే వ్యాక్సిన్‌గా ఉంటుంది. కోవాక్సిన్‌ని తీసుకున్నవారు కోవాక్సిన్‌ని అందుకుంటారు. కొవిషీల్డ్‌ని మెుదటి రెండు డోస్‌లు పొందిన వారు కోవిషీల్డ్‌ని అందుకుంటారు.' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.
దేశంలో జనవరి 3వ తేదీ నుంచి.. 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి కోసం కోవిడ్-19 టీకా డ్రైవ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి రోజునే, 40 లక్షల మంది వరు టీకా వేసుకున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఇప్పటికే 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు అందించినట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చెప్పారు.