Bombay High Court: భర్తను రోడ్డుపైనే ‘నపుంసకుడు’ అని అరిచిన భార్య, తర్వాత ఘోరం, బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ముగ్గురు పిల్లలకు తండ్రి అయినప్పటికీ అతని భార్య భర్తను నపుంసకుడు అని అందరి ముందూ గట్టిగా అరిచి అతణ్ని రెచ్చగొట్టిందని.. కోర్టు తీర్పు వెల్లడిస్తూ చెప్పింది.
అందరి ముందూ నపుంసకుడు అని పిలిస్తే ఏ పురుషుడైనా అవమానంగా భావించడం సహజమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. విడాకుల అనంతరం మాజీ భార్యను హత్య చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి ఈ కేసులో అతణ్ని బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్ సాధనా జాదవ్, జస్టిస్ పృథ్వి చవాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ముగ్గురు పిల్లలకు తండ్రి అయినప్పటికీ అతని భార్య భర్తను నపుంసకుడు అని అందరి ముందూ గట్టిగా అరిచి అతణ్ని రెచ్చగొట్టిందని కోర్టు తీర్పు వెల్లడిస్తూ చెప్పింది.
ఈ కేసు ఏంటంటే.. నందు అనే పండర్ పూర్ వాసి శకుంతల అనే మహిళను 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు పుట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా గొడవల కారణంగా ఇద్దరికీ మనస్ఫర్థలు వచ్చాయి. గత నాలుగేళ్లుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. కూలీగా పని చేస్తున్న నందు 2009 ఆగస్టు 28న తన పనికి వెళ్తుండగా.. భార్య శకుంతల కూడా అతణ్ని వెంబడించింది. ఓ బస్సు డిపో వద్దకు చేరుకోగానే శంకుతల భర్త కాలర్ పట్టుకొని దుర్భాషలాడింది. ప్రత్యక్ష సాక్షులు కోర్టులో తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన భర్తను బూతులు తిట్టడమే కుండా పదే పదే నపుంసకుడు అని తిట్టింది. అతను నపుంసకుడు కాబట్టి, తాను విడిగా ఉంటున్నానని, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని ఆమె సమర్థించుకుందని అతను తెలిపాడు.
నందు తరఫు న్యాయవాది శ్రద్ధా సావంత్ వాదిస్తూ, తన క్లయింట్ తనపై జరిగిన దుర్భాషలు, ‘‘అతని గౌరవానికి భంగం కలిగేలా చేసిన వ్యాఖ్యల’’ వల్ల కూడా తీవ్రంగా రెచ్చిపోయాడని వాదించారు. కాబట్టి, తన క్లయింట్‌ను హత్యానేరం నుండి నిర్దోషిగా విడుదల చేయాలని ఆమె బెంచ్‌ను కోరారు. అయితే, నిందితుడు నందు సంయమనం పాటించి ఉండాల్సిందని ప్రాసిక్యూటర్ వీర షిండే వాదించారు. మరనించిన శకుంతలపై పడిన 10 గాయాలు, కత్తిపోట్లను గాయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అయితే, హత్య జరిగేందుకు దారితీసిన పరిస్థితులను లోతుగా విశ్లేషించిన బెంచ్.. “నందు ముగ్గురు ఎదిగిన పిల్లలకు తండ్రి. మృతురాలను నిందితుడిని వెంబడించి అతని మార్గాన్ని అడ్డుకోవడమే కాకుండా, అతని మెడ పట్టుకుని, చొక్కా లాగి దూషించడం ప్రారంభించింది. పైగా నిందితుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నపుసంకుడు అంటూ వ్యాఖ్యలు చేసింది. రద్దీగా ఉండే రహదారిపై జరిగింది పట్టపగలు అందరూ ఉండగా చేసిన ఆ వ్యాఖ్యలు అతని గౌరవానికి తీవ్రమైన భంగం కలిగించాయి. ఆ మాటలను అందరూ విన్నారు. సమాజంలో అతని విలువ తగ్గించబడింది.’’ అని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.