PM Modi: ప్రధాని మోదీతో భేటీకి ముందు కోవిడ్19 టెస్టు చేయించుకోవాలి- ముందు జాగ్రత్త చర్యలు!
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ముఖ్యమైన సమావేశం జరగనుంది. ఢిల్లీ సీఎం, బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Ministers Asked To Undergo COVID Test Before Meeting PM Modi | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా కోవిడ్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 7 వేలు దాటాయి. ఈ క్రమంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్న మంత్రులందరూ ముందుగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఇదే వారికి సూచించారని జాతీయ మీడియాలో నివేదికలు పేర్కొన్నాయి.
నేటి సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరగనున్న కీలక సమావేశానికి ముందు ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సహా మంత్రులు, బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రోటోకాల్ ప్రకారం, సమావేశానికి హాజరయ్యేవారు ఆర్టీ-పీసీఆర్ పరీక్షను చేసుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.
మీడియా లేటెస్ట్ నివేదికల ప్రకారం, ర్యాలీలలో ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకునే అధికారులు కూడా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. వారికి టెస్టుల్లో నెగటివ్ వస్తేనే ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే కరోనా పాజిటివ్ గా తేలితే ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.
భారత్‌లో 7,000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
కరోనా కొత్త వేరియంట్‌ల కారణంగా భారత్‌లో మళ్లీ కోవిడ్19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 7,000 మార్కును దాటాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో 7,121 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 8,573 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో 757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 66 మందికి కరోనా సోకింది. ఇటీవల ఢిల్లీలో మొత్తం 90 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు.
కేరళలో అత్యధిక కోవిడ్-19 కేసులు
కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 170 మంది కరోనా బారిన పడగా.. మొత్తం 2,223 యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్ 114 పాజిటివ్ కేసులతో రెండవ స్థానంలో ఉంది, కర్ణాటకలో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. LF.7, XFG, JN.1, NB.1.8.1తో సహా అనేక కొత్త సబ్ వేరియంట్ల కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. .
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో ఆరు మంది చనిపోయారు. అందులో ఒక్క కేరళలోనే మూడు మరణాలు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే జనవరి 2025 నుండి మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 74కి చేరింది.
మహారాష్ట్రలో నమోదైన మరణాలలో 43 ఏళ్ల వ్యక్తి శ్వాస సమస్య, పొత్తికడుపు నొప్పి, బాధ, సైనోసిస్ వంటి తీవ్రమైన లక్షణాలతో ఉన్నాడు. అతడికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, ఇది సమస్యలకు గురిచేస్తుందని ఆరోగ్య అధికారులు తెలిపారు.
దేశంలో తాజా పరిస్థితులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, టెస్టుల సంఖ్య పెంచాలని.. హాస్పిటల్స్ లో బెడ్స్ ఏర్పాటు చేయడం, ఆక్షిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచడం లాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రద్దీగా ఉండే ప్రదేశాలలో, ప్రయాణించేటప్పుడు మాస్కులు ధరించడం లాంటివి పాటించడం మంచిదని సూచిస్తున్నారు.






















