Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ
Maoist Party: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి బస్తర్ కమాండర్ గా మాడ్వి హిడ్మా బాధ్యతలు చేపట్టారు. 'ఆపరేషన్ కగార్'పై పోరాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రకటించారు.

Maoist Party: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి అలియాస్ దేవ్ జి, బస్తర్ కమాండర్ గా గెరిల్లా సుప్రీం లీడర్ మాడ్వి హిడ్మా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో 'ఆపరేషన్ కగార్'కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలంతా గెరిల్లా యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) కేంద్ర కమిటీ 21వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేస్తూ, 9 పేజీల లేఖను విడుదల చేసింది. మావోయిస్టులకు, పార్టీ శ్రేణులకు, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించేందుకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు అధిగమించడానికి, ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి ఓ వేదికగా ఈ ఉత్సవాలు జరగనున్నాయని తెలిపింది.

పార్టీ ముఖ్య నేతల అమరత్వంపై మావోయిస్టు పార్టీ ఏం చెప్పిందంటే...
గత ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న 'ఆపరేషన్ కగార్'లో పార్టీకి జరిగిన నష్టాన్ని స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది. 1972లో పార్టీ ప్రధాన కార్యదర్శి చారు మజుందార్‌ను ప్రభుత్వం హత్య చేసిన తర్వాత, ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం చేతిలో తమ నాయకులను కోల్పోవడం ఇదే తొలిసారి అని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు, పార్టీ కీలక నేతలు చలపతి, కిషన్, విలాస్, భరత్, హర్ష, గోతం, వివేక్, ఉదయ్ వంటి పోరాట యోధులు అమరులు కావాల్సి వచ్చిందని ఆ పార్టీ లేఖలో పేర్కొంది. ఈ నష్టాలు తమ విప్లవోద్యమాన్ని, సైద్ధాంతికంగా దీర్ఘకాలం ప్రభావితం చేస్తాయని పార్టీ అంగీకరించింది. అయితే ఈ నష్టాన్ని అధిగమించి ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని, పార్టీని బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని మావోయిస్టు పార్టీ 9 పేజీల లేఖ ద్వారా ప్రకటన చేసింది.

'ఆపరేషన్ కగార్' సైనిక యుద్ధమే అంటోన్న మావోయిస్టు పార్టీ.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'ను మావోయిస్టు పార్టీ పెద్ద సైనిక యుద్ధంగా తన లేఖలో వివరించింది. ఈ ఆపరేషన్ ఎదుర్కొని, రాజ్యాన్ని ఓడించి తీరతామని లేఖ ద్వారా చెప్పారు. గెరిల్లా యుద్ధాన్ని పటిష్టం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను ఎదుర్కోవడానికి ప్రజలను సన్నద్ధం చేస్తామని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఇందు కోసం విస్తృత ప్రచారం చేపడతామని తెలిపింది. పార్టీకి ఉన్న బలహీనతలను ఈ లేఖలో మావోయిస్టు నేతలు ప్రస్తావించారు. పార్టీకున్న నియంత్రణలు, సైద్ధాంతిక సమస్యలు, నిధుల కొరత, ప్రజల్లో తమకు తగ్గిన మద్దతు వంటి బలహీనతలు వెంటాడుతున్నాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఈ లేఖ ద్వారా మావోయిస్టు నాయకత్వం పిలుపునిచ్చింది.


మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారానికి అన్నింటినీ వాడాలని మావోయిస్టు పార్టీ పిలుపు.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, పోరాట స్ఫూర్తిని, నాయకుల అమరత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించాలని పార్టీ శ్రేణులకు లేఖ ద్వారా అధినాయకత్వం పిలుపునిచ్చింది. ప్రజానాట్యమండలి బుర్రకథలు, పాటలు, కవితలు, జానపదాలు, సాహిత్యం వంటి వాటిని ఆయుధంగా వాడుకోవాలని సూచన చేసింది. "బండెనక బండి కట్టి", "పల్లె పల్లెన పండుగ నేడు" వంటి పాటల స్ఫూర్తిని తిరిగి ప్రజల్లో రగిలించాలని పార్టీకి అధినాయకత్వం సూచించింది. అలాగే, డిజిటల్ మాధ్యమాలను కూడా ప్రచారానికి ఉపయోగించుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు.


మహిళల కోసం మావోయిస్టులు ఏం చెప్పారంటే...
మావోయిస్టు పార్టీలో మహిళా నాయకత్వాన్ని, అమరులైన మహిళలను గుర్తు చేస్తూ పార్టీ అధినాయకత్వం తన లేఖలో తెలంగాణ విమోచన ఉద్యమాన్ని ప్రస్తావించింది. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళా యోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చింది. తమ ఇంటి పనులు చేసుకుంటూనే వారు సమాచార వాహకులుగా, ఆయుధాలను అందించే సరఫరాదారులుగా నాటి ఉద్యమంలో ఎలా పని చేశారో గుర్తు చేసుకోవాలని మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొంది. అంతే కాకుండా గ్రామగ్రామాన నాటి పోరాట జ్ఞాపకాలను డాక్యుమెంట్ చేయాలని, వీర గాథలను, పోరాట యోధుల చరిత్రను నేటి సమాజానికి తెలుపుతూ మావోయిస్టు ఉద్యమం బలపడేలా ఉపయోగించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన చేసింది.


శాంతి చర్చలకు సిద్దమే
ఈ నెల ఆరో తేదీన విడుదల చేసిన లేఖ ద్వారా అనేక అంశాలను మావోయిస్టు పార్టీ ప్రస్తావించింది. దేశంలోని ఆర్థిక అంశాలను, ఎన్డీఏ పాలన అంశాలను, అమెరికా పన్ను పోటును, అమెరికా చైనా ఘర్షణ, ఇజ్రాయెల్ - గాజాలమధ్య ఘర్షణ వంటి అంతర్జాతీయ అంశాలను లేఖలో ప్రస్తావించింది. అయితే పార్టీకి ఎదురుదెబ్బలు సహజమేనని వీటన్నింటిని ఎదుర్కొనే ముందుకు వెళతాని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇప్పటీ కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరం ఉందని, ఆపరేషన్ కగార్ ను ఆపాలని డిమాండ్ చేసింది.






















