టీడీపీ కార్యకర్త గురునాథ్, వైసీపీ కార్యకర్త గిరి మధ్య ఫోన్‌లో వ్యక్తిగత దూషణలతో వివాదం మొదలైంది. ఇది గొడవకు దారితీసి ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది.
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
YSRCP MLA Virupakshi | కర్నూలు జిల్లా నేమకల్లులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి ఘటనలో టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదుతో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

- ఆలూరులో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
- ఎమ్మెల్యే విరూపాక్షి రాకతో రాళ్లదాడి జరిగి పలువురు గాయపడ్డారు.
- టీడీపీ కార్యకర్త ఫిర్యాదుతో ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదైంది.
- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Andhra Pradesh Politics | ఆలూరు: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్యేతో సహా 15 మందిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం, దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులైన 15 మందిపై చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధితుడైన టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, సంగాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గిరిల మధ్య ఫోన్‌లో వ్యక్తిగత దూషణలు జరిగాయి. ఈ వివాదం కాస్తా పెరిగి వారి మధ్య గొడవకు దారితీయగా.. ఈ విషయాన్ని కార్యకర్త గిరి వైసీపీకి చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి తెలియజేశాడు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలసి నేమకల్లు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రమై పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈ రాళ్లదాడిలో టీడీపీకి చెందిన శేఖర్ తలకు తీవ్ర గాయం కాగా, నాగరాజు స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు చేతికి కూడా గాయమైందని తెలిసిందే.
కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు
ఘటనపై సమాచారం అందుకున్న ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి వెంటనే గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం, రాళ్లదాడిలో గాయపడిన తమ కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ మండల కన్వీనరు కొండా పురుషోత్తం, సొసైటీ ఛైర్మన్ రామాంజినేయులు నేమకల్లుకు వెళ్లగా... వైసీపీ నాయకులు వారి కారుపై దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడ నుంచి పంపించివేశారు.
టీడీపీ కార్యకర్త ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు
తీవ్రంగా గాయపడిన శేఖర్, నాగరాజులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములును గుంతకల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తమ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు, ఈ ఘటనలో ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బైఠాయించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బాధితుడైన టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేసినట్లు చిప్పగిరి ఎస్‌ఐ వెల్లడించారు. ఈ ఘర్షణ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిప్పగిరి, నేమకల్లు, సంగాల గ్రామాల్లో పోలీసులు భారీగా బందోబస్తు, పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Frequently Asked Questions
ఆలూరు నియోజకవర్గంలో వివాదానికి కారణం ఏమిటి?
రాళ్లదాడిలో ఎవరు గాయపడ్డారు?
టీడీపీ కార్యకర్తలు శేఖర్ తలకు తీవ్ర గాయం కాగా, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు చేతికి కూడా గాయమైంది.
వైసీపీ ఎమ్మెల్యేపై నమోదైన కేసు ఏమిటి?
టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షి, ఆయన అనుచరులు 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
పోలీసులు పరిస్థితిని ఎలా అదుపులోకి తెచ్చారు?
ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘర్షణలు జరగకుండా చిప్పగిరి, నేమకల్లు, సంగాల గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















