Manipur Violence: కుకీలు మైతేయిల మధ్య నలిగిపోతున్న ముస్లింలు, క్షణక్షణం భయమే
Manipur Violence: మణిపూర్‌లోని కుకీలు, మైతేయిల ఘర్షణ మధ్య ముస్లింలు నలిగిపోతున్నారు.
Manipur Violence:
కాల్పుల మోత..
మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎలాంటి అల్లర్లు జరగలేదు. అన్ని చోట్లా ప్రశాంతంగానే ఉన్నా...చురచందపూర్, బిష్ణుపూర్ ప్రాంతాల్లో మాత్రం కాల్పుల మోత ఆగడం లేదు. చురచందపూర్‌లోని కుకీ వర్గానికి చెందిన పౌరులు, బిష్ణుపూర్‌లోని మైతేయిల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు కాల్పులతో విరుచుకు పడుతున్నారు. బాంబు దాడులూ చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దారి పొడగునా అలజడి ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ రెండు వర్గాల మధ్య ముస్లింలు నలిగిపోతున్నారు. 32 లక్షల జనాభా ఉన్న రాష్ట్రంలో 9% మంది ముస్లింలున్నారు. కుకీలు, మైతేయిల మధ్య గొడవల కారణంగా...ముస్లింలు భయపడిపోతున్నారు. వీలైనంత త్వరగా ఈ హింసకు స్వస్తి పలకాలంటూ రెండు వర్గాలనూ కోరుకుంటున్నారు. కానీ...ఇరు వర్గాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిష్ణుపూర్‌లోని క్వాత్‌కా ఏరియాలో భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. బారికేడ్‌లు పెట్టారు. మళ్లీ మళ్లీ గొడవలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తండ్రికొడుకుల హత్య
బిష్ణుపూర్‌లో ఆగస్టు 6న ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కొడుకులపైన కాల్పులు జరిపారు. అక్కడికక్కడే మృతి చెందారు. కుకీలే ఈ దారుణానికి పాల్పడ్డారని మైతేయిలు ఆరోపించారు. ఫలితంగా రెండు గ్రామాల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ హింస కారణంగా రెండు మసీదుల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే కాల్పులు జరిగాయి. ఫలితంగా ఆ ప్రాంతంలోని ముస్లింలు భయాందోళనలకు లోనవుతున్నారు. క్వాత్‌కాలో ముస్లింల జనాభానే ఎక్కువ. అందుకే...అక్కడ అంతగా ఆందోళన పెరుగుతోంది. ఈ గొడవల్లో తమ పిల్లలు ఎక్కడ ప్రాణాలు కోల్పోతారో అని కలవర పడుతున్నారు స్థానికులు. అసలు ఈ హింసతో ఎలాంటి సంబంధం లేకపోయినా..బాధితులుగా మిగిలిపోతున్నారు ముస్లింలు. భయంతో చెల్లాచెదురైపోయారు. క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. విద్యార్థులు బడికి వెళ్లలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో అత్యాచారం...
మణిపూర్ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడ మహిళలపై ఎంత దారుణమైన దాడులు జరుగుతున్నాయో ఆ వీడియోతో ప్రపంచానికి తెలిసింది. కానీ...ఇప్పటికీ వెలుగులోకి రాని దారుణాలు చాలానే ఉన్నాయి. ఎంతో మంది అత్యాచార బాధితులు ఇప్పుడిప్పుడే తమ ఆవేదనను బయటకు చెబుతున్నారు. న్యాయం జరుగుతుందన్న ఆశతో పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ 37 ఏళ్ల బాధితురాలు తన బాధనంతా బయటపెట్టింది. చురచందపూర్‌లో ఓ వర్గం వాళ్లు వచ్చి ఇళ్లన్నీ తగలబెడుతుంటే కుటుంబంతో సహా పారిపోవాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇద్దరు కొడుకులు, మేన కోడలితో బయటకు వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు వచ్చి ఆమెను అడ్డగించారు. బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. మే 3వ తేదీన ఈ దారుణం జరిగినా...ఇన్నాళ్లూ నోరి విప్పలేదని చెప్పింది. పోలీసుల వరకూ వెళ్లి ఫిర్యాదు చేసే ధైర్యం ఇన్నాళ్లూ లేదని, ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం తెచ్చుకుని కంప్లెయింట్ ఇచ్చినట్టు వివరించింది.
Also Read: మణిపూర్‌లో సర్జికల్ స్ట్రైక్‌లు చేయండి, బీజేపీ మిత్రపక్ష నేత సంచలన వ్యాఖ్యలు