గంట గంటకీ ఉత్కంఠగా మహా రాజకీయాలు, ముంబయిలోని ఓ హోటల్‌లో మంతనాలు
Maharashtra NCP Crisis: తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలను ముంబయిలోని ఓ హోటల్‌కి తరలించారు అజిత్ పవార్.
Maharashtra NCP Crisis:
ఈసీ కోర్టులో బంతి..
మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ వర్సెస్ పవార్ యుద్ధం ముదురుతోంది. NCP పార్టీ పేరుని, గుర్తుని లాగేసుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అజిత్ పవార్. అటు శరద్ పవార్ అందుకు అడ్డు తగులుతున్నారు. న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ విషయం ఎన్నికల సంఘం వరకూ వెళ్లింది. అజిత్ పవార్ వర్గం "మాకే మెజార్టీ" ఉందని ఈసీకి వెల్లడించింది. అటు శరద్ పవార్ ఢిల్లీ వేదికగా కీలక భేటీకి పిలుపునిచ్చారు. తన పార్టీ పేరుని కానీ, గుర్తుని కానీ ఎవరూ దొంగిలించలేరని స్పష్టం చేశారు. అజిత్ పవార్ మాత్రం తనకు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్‌పీల మద్దతు ఉందని ప్రకటించారు. అందుకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పేరుని, గుర్తుని తనకే కేటాయించాలని తేల్చి చెబుతున్నారు. "వెళ్లిపోయిన నేతల్ని వెనక్కి రప్పించుకుంటాం" అని శరద్ పవార్ చేసిన కామెంట్స్‌తో అజిత్ పవార్ అలెర్ట్ అయ్యారు. తనకు మద్దతునిస్తున్న నేతలందరినీ ముంబయిలోని ఓ హోటల్‌లో ఉంచారు. ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. వాళ్లు సంతకాలు చేసిన అఫిడవిట్‌లను ఈసీకి సమర్పించారు. జులై 1వ తేదీన అజిత్ పవార్ NCPని వీడారు. అంతకు ముందు రోజే...పక్కా ప్లాన్‌తో అందరితోనూ సంతకాలు చేయించుకున్నారు. NCP కార్యకర్తలతో ఇటీవల సమావేశమైన ఆయన...సంచలన వ్యాఖ్యలు చేశారు. "83 ఏళ్లు వచ్చాయి. మీరింకా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోరా..? ఎప్పుడు రిటైర్ అవుతారు..?" అంటూ శరద్ పవార్‌పై విమర్శలు చేశారు.
"వేరే ఏ పార్టీలో అయినా సరే ఓ వయసు రాగానే నేతలు రిటైర్ అయిపోతారు. బీజేపీలో 75 ఏళ్లు రాగానే వాళ్లు పదవి నుంచి తప్పుకుంటారు. మరి మీరెప్పుడు రిటైర్ అవుతారు..? కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలిగా. మేమేమైనా తప్పు చేస్తే చెప్పండి. మీ వయసు ఇప్పటికే 83. ఇంకా ఆగకుండా పని చేస్తారా..?"
- అజిత్ పవార్
ప్రత్యేక సమావేశాలు..
శరద్ పవార్ వర్గం కూడా ప్రత్యేకంగా భేటీ అయింది. మొత్తం 53 మంది NCP ఎమ్మెల్యేల్లో 32 మంది అజిత్ పవార్ మీటింగ్‌కి హాజరయ్యారు. 14 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ సమావేశంలో కనిపించారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలనుందని తేల్చి చెప్పారు అజిత్ పవార్. అంటే...పరోక్షంగా ఏక్‌నాథ్ శిందేని గద్దె దించుతారన్న సంకేతాలిచ్చారు. ఇప్పటికే ఈ విషయమై చాలా మంది కాంగ్రెస్ నేతలు స్పష్టతనిచ్చారు. కేవలం శిందే వైఖరి నచ్చకపోవడం వల్లే అజిత్ పవార్‌కి గాలం వేసి లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే శిందే స్థానాన్ని అజిత్ పవార్ రీప్లేస్ చేస్తారని చెబుతున్నారు. శరద్ పవార్ కూడా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని చీలనివ్వనని శపథం చేశారు. కానీ...ప్రస్తుత పరిస్థితులు మాత్రం అజిత్ పవార్‌కే అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అజిత్ పవార్ వర్గంలోని నేతలంతా చివరి వరకూ ఆయన వెంటే ఉంటారా అన్న దానిపైనే...ఆయన NCPని హస్తగతం చేసుకుంటారా లేదా అన్నది తేలి పోతుంది.
Also Read: గంట గంటకీ ఉత్కంఠగా మహా రాజకీయాలు, ముంబయిలోని ఓ హోటల్‌లో మంతనాలు