సెప్టెంబర్‌లో మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు - శిందే పదవికి ఎసరు తప్పదా?
Maharashtra Politics: మహారాష్ట్రకు సెప్టెంబర్‌లో కొత్త ముఖ్యమంత్రి వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Maharashtra Politics:
కొత్త సీఎం వస్తారు..
మహారాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరిగాయో గమనించాం. NCPకి చెందిన కీలక నేత అజిత్ పవార్ ఆ పార్టీని వీడి శిందే ప్రభుత్వంతో చేతులు కలిపారు. అప్పటి నుంచి శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అంతకు ముందు శిందే ఉద్దవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా వెనకుండి నడిపించింది బీజేపీయే అన్న వాదన వినిపిస్తూనే ఉంది. ఆ తరవాత అజిత్ పవార్ NCP నుంచి బయటకు రావడం వెనకా బీజేపీయే ఉందన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు తరచూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏక్‌నాథ్ శిందే పని తీరుపై బీజేపీ హైకమాండ్ అసంతృప్తిగా ఉందని, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే అజిత్ పవార్‌ని తీసుకొచ్చిందని ఆరోపించారు. చాలా సందర్భాల్లో దీనిపై చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెత్తివర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారిపోతారని, సెప్టెంబర్‌లో కొత్త సీఎం వస్తారని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదని, ఇలాంటి పని తీరుతో ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదని తేల్చి చెప్పారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
"మహారాష్ట్రలో రాజకీయాలు ఎలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. అందరూ అధికారం కోసమే పాకులాడుతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి మారిపోయే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి శిందే, డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మధ్య సయోధ్య లేదు. శిందే డిన్నర్‌కి ఆహ్వానించా ఫడణవీస్ వెళ్లలేదు. అంటే...ఏదో జరుగుతోందనేగా అర్థం. బహుశా సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి మారిపోతుండొచ్చు"
- విజయ్ వడెత్తివర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
#WATCH | Vijay Wadettiwar, LoP Maharashtra & Congress leader, says, "What's happening in Maharashtra is not right...This government will not last...There is danger to the main chair (CM) in Maharashtra. I can say there will be a change in the main chair by September..." pic.twitter.com/7qZYrN7RGq
— ANI (@ANI) August 19, 2023
సీఎం మారిపోతారా..?
కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నా...బీజేపీ మాత్రం దీన్ని కొట్టి పారేస్తోంది. గత నెల మీడియా ఇదే విషయంపై దేవేంద్ర ఫడణవీస్‌ని ప్రశ్నించింది. అందుకు ఆసక్తికర సమాధానమిచ్చారాయన.
"అజిత్ పవార్‌తో మాకున్న బంధం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం. కానీ శివసేన నుంచి వచ్చిన ఏక్‌నాథ్ శిందేతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే ఆలోచనే లేదు. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు"
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం
Also Read: ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌పై WHO ప్రశంసలు, ప్రపంచంలోనే గొప్ప పాలసీ అంటూ కితాబు