వలలో చిక్కిన "మోస్ట్ వాంటెడ్" మంకీ, 2 వారాలుగా అధికారులకు చుక్కలు
Most Wanted Monkey: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్‌లో 20 మందిపై దాడి చేసిన కోతిని మొత్తానికి పట్టుకున్నారు.
Most Wanted Monkey:
రాజ్‌గర్‌లో 20 మందిపై కోతి దాడి
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్‌లో మోస్ట్ వాంటెడ్ మంకీని మొత్తానికి పట్టుకున్నారు. ఇప్పటికే 20 మందిపైన దాడి చేసిన ఈ కోతిని పట్టి ఇచ్చిన వాళ్లకు రూ.21 వేల నజరానా ఇస్తామని అధికారులు ప్రకటించారు. దాదాపు రెండు వారాలుగా దీని కోసం వెతుకుతున్నారు. ఎక్కడా చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టింది ఈ కోతి. ఇక లాభం లేదని ఉజ్జెయిన్ నుంచి స్పెషల్ టీమ్‌ని రంగంలోకి దింపారు. జులై 21 సాయంత్రం అధికారులతో పాటు స్థానికులు కలిసి అతి కష్టం మీద ఆ కోతిని పట్టుకున్నారు. కోతి ఎక్కడుందో కనుక్కోడానికి డ్రోన్ కూడా వాడారు. వలలో చిక్కుకోడానికి నానా ఇబ్బందులు పడి చివరకు దాన్ని బంధించారు. ఇదంతా చాలా డ్రమటిక్‌గా జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోగా స్థానికులంతా జైశ్రీరామ్, జై బజ్‌రంగ్ బలి అంటూ నినాదాలు చేశారు. చాలా రోజులుగా ఈ కోతి స్థానికులను తెగ ఇబ్బంది పెడుతోంది. కొందరైతే దీని బారి నుంచి తమను కాపాడుకోడానికి గార్డ్‌లనూ పెట్టుకున్నారు. ఆ గార్డ్‌లు తుపాకులు పట్టుకుని మరీ ఇంటిపైన కాపలా కాశారు. గత 15 రోజుల్లో 20 మందిపై దాడి చేసింది ఈ కోతి. వారిలో 8 మంది చిన్నారులే ఉన్నారు. డాబాపైన గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేసిందని, తరవాత కిటికీలో నుంచి వచ్చి దాడి చేసేదని స్థానికులు వివరించారు. దాదాపు అందరూ తీవ్రంగానే గాయపడ్డారు.
ఈ కోతిని పట్టుకునేందుకు ఆ ఏరియాలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు పెట్టారు. ఓ వృద్ధుడిపై దాడి చేసి నేలపై పడేసి లాక్కెళ్లిన వీడియో అందులో రికార్డ్ అయింది. మరో వ్యక్తిపై దాడి చేసి తొడ భాగంలో తీవ్రంగా గాయపరిచింది. అధికారుల కంటపడకుండా తప్పించుకుని తిరిగిన ఈ కోతిని పట్టిచ్చిన వారికి రూ.21 వేలు ఇస్తామని రివార్డ్ ప్రకటించారు.
"కోతిని బంధించాలన్నది మా ఉద్దేశం కాదు. మారు వేరే ఆప్షన్ లేక ఈ పని చేశాం. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రెస్క్యూ టీమ్‌ని పిలిపించాం. అటవీ అధికారులూ వచ్చారు. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు స్థానికులూ సాయం చేశారు. అయినా ఆ కోతిని పట్టుకోడానికి నాలుగు గంటల సమయం పట్టింది. కోతిన పట్టుకున్న వాళ్లకు రూ.21 వేలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడా డబ్బుని రెస్క్యూ టీమ్‌కి ఇచ్చేస్తాం"
- అధికారులు
ఎవరైన అల్లరి ఎక్కువ చేస్తే "కోతి చేష్టలు", "కోతి పనులు" అంటూ తిడుతూ ఉంటారు. ఎందుకంటే కోతులు (Monkey) చేసే తుంటరి పనులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ కోతి చేసిన పని దాని ప్రాణంపైకి వచ్చింది. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ ఓ కోతి అనుకోకుండా బైక్ ముందు చక్రం మధ్యలో ఇరుక్కుపోయింది. ఉత్తర్‌ప్రదేశ్ బదోసరాయ్ ప్రాంతంలో గతేడాది ఈ ఘటన జరిగింది. బైక్ వేగంగా వెళ్తోన్న సమయంలో ఓ కోతి (Monkey) సడెన్‌గా రోడ్డు దాటబోయింది. ఆ సమయంలో అనుకోకుండా ఆ కోతి బైక్ ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన ఆ బైకర్.. వెంటనే బండిని ఆపేశాడు. బైక్ చక్రం నుంచి బయటపడడానికి ఆ కోతి చాలా ఇబ్బంది పడింది. చివరికి స్థానికులు అతి కష్టం మీద దానిని విడిపించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.