Lancet Study: క్యాన్సర్ గుర్తింపులో కూడా లింగ వివక్ష - అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువట
Lancet Study: దేశంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. అయితే ఇందుకు కారణం లింగ వివక్షే అని వివరించింది.
Lancet Study: భారత దేశంలో అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని లాన్సెట్ తాజా అధ్యయనం తెలిపింది. అయితే ఇందుకు కారణం లింగ వివక్షనే అని అంచనా వేసింది. అమ్మాయిల్లోనూ క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పటికీ.. వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లకపోవడం, పరీక్షలు, చికిత్స చేయించకపోవడం వల్లే వ్యాధి నిర్ధారణ అవడం లేదని అభిప్రాయపడింది.
యువతలో క్యాన్సర్ కేసులు బయటపడుతున్న తీరుపై భారత పరిశోధకులు జరిపిన అధ్యయన నివేదిక లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితం అయింది. దిల్లీ ఎయిమ్స్, చెన్నై అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ (ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్) పరిశోధకులు దేశంలో మూడు ప్రధాన క్యాన్సర్ చికిత్సా కేంద్రాల నుంచి సేకరించిన ఏళ్ల రికార్డులను పరిశీలించారు.
నిర్ధారణ, చికిత్సలోనూ అబ్బాయిల సంఖ్యే ఎక్కువ..
వీటిని మరో రెండు పాపులేషన్ బేస్ డ్ క్యాన్సర్ రిజిస్ట్రీల సమాచారంతో పోల్చి చూశారు. ఆయా ఆస్పత్రుల్లో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స చేయించుకున్న పరుషులు, స్త్రీల నిష్పత్తిని అంచనా వేశారు. పీబీసీఆర్ లో నమోదైన వేల బాధితుల రికార్డులను పరిశీలించగా.. క్యాన్సర్ నిర్ధారణ చేసుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఎవరు చికిత్స పొందుతున్నారో చూసేందుకు వీలు కల్పించింది.
మొత్తం మూడు ఆసుపత్రుల్లో క్యాన్సర్‌తో బాధపడుతున్న 22 వేల మంది పిల్లలలో, బాలికల కంటే ఎక్కువ మంది అబ్బాయిలు చికిత్స పొందుతున్నట్లు తెలిసినట్లు ఎయిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సమీర్ భక్షి వెల్లడించారు. అమ్మాయిలు క్యాన్సర్ బారిన పడినా ఆ విషయాన్ని ధ్రువీకరించుకోవడమే తక్కువగా ఉందని.. ఒక వేళ క్యాన్సర్ వచ్చినట్లు తేలినా... అబ్బాయి అయితేనే చికిత్స కోసం ఆస్పత్రులకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అమ్మాయిలు అయితే కాస్త ఉదాసీనంగా ఉంటున్నట్లు తెలిసినట్లు వివరించారు.
దూరం, ఖర్చు పెరిగితే చికిత్స ఆపేస్తున్న అమ్మాయిలు..
"పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య అసమానత ఎక్కువగా ఉంది. తమ ఇంటి నుండి ఆస్పత్రి 100 కిలో మీటర్లకు మించి దూరం ఉంటే తక్కువ సంఖ్యలో బాలికలు ఆసుపత్రికి వస్తున్నారు. చికిత్సకు సంబంధించిన ఖర్చులు పెరిగితే, పక్షపాతం కూడా పెరుగుతోంది. అంటే దూరం, ఖర్చు పెరిగితే అమ్మాయిలు నిర్ధారణ, చికిత్స చేయించుకోవడానికి దూరం అవుతున్నారు. దక్షిణ భారత్ తో పోలిస్తే ఉత్తరాధి రాష్ట్రాల్లోనే తక్కువ మంది బాలికలు క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులో చికిత్స తీసుకునే బాలికల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటోంది. ఇది కూడా లింగ వివక్షే" అని ప్రొఫెసర్ సమీర్ భక్షీ తెలిపారు.
క్యాన్సర్ పరీక్షల విషయంలోనే కాకుండా ఎంత మంది క్యాన్సర్ బాధితులు అత్యంత ఖరీదైన మూలకణ మార్పిడి చికిత్ చేయించుకుంటున్నారో అనే అంశాన్ని కూడా వైద్యులు పరిశీలించారు. అయితే అక్కడ కూడా లింగ వివక్ష ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రజల్లో ఉన్న ఈ తరహా ఆలోచనా ధోరణిని మార్చాల్సిన అవసరం చాలా ఉందని, లింగ వివక్షకు అడ్డుకట్ట వేయాలంటే విద్య సాధనంగా ఉపయోగించుకోవాలని ప్రొఫెసర్ భక్షీ వివరించారు. అలాగే క్యాన్సర్ సోకిన బాలికలకు ఉచిత చికిత్స అందించడం ద్వారా కూడా క్యాన్సర్ విషయంలో లింగ వివక్షను తగ్గించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.