(Source: ECI/ABP News/ABP Majha)
కరోనా రోజుల్ని గుర్తు చేస్తున్న నిఫా వైరస్, కేరళలో కంటెయిన్మెంట్ జోన్‌లు
Kerala Nipah Alert: కేరళలో నిఫా వైరస్ వ్యాప్తితో పలు చోట్ల కంటెయిన్మెంట్ జోన్‌లు ప్రకటించారు.
Kerala Nipah Alert:
నిఫా వైరస్ కలకలం..
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఒక్కసారిగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు 18 ప్రత్యేర ప్యానెల్స్‌ని ఏర్పాటు చేశారు. కొజికోడ్ మెడికల్ కాలేజీలో ఈ బాధితుల కోసం ప్రత్యేకంగా 75 గదులు కేటాయించినట్టు వెల్లడించారు వీణా జార్జ్. రెండు సెంటర్ల వద్ద వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఆ పరిసరాల్లో 5 కిలోమీటర్ల మేర కంటెయిన్‌మెంట్ జోన్స్ (Containment Zones)గా ప్రకటించింది ఆరోగ్య శాఖ. వీటితో పాటు 7 గ్రామ పంచాయితీలనూ కంటెయిన్మెంట్ జోన్స్‌గా ప్రకటించింది. కొజికోడ్ జిల్లా కలెక్టర్ ఎ.గీతా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆంక్షలు విధించిన జోన్‌ల లిస్ట్‌ను వెల్లడించారు. ఈ జోన్‌లలో ప్రయాణాలపై పూర్తి ఆంక్షలు విధించారు. కేవలం నిత్యావసర సరుకులను మాత్రమే అందించేందుకు మినహాయింపునిచ్చారు. ఈ ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. మెడికల్ షాప్‌లు, నిత్యావసర సరుకుల దుకాణాలు తప్ప మరేవీ తెరుచుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే ఈ షాప్‌లు తెరిచి ఉంటాయి. ఫార్మసీలు, హెల్త్ సెంటర్స్‌కి మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
కంటెయిన్మెంట్ జోన్‌లు..
స్థానిక ప్రభుత్వం సంస్థలు, కార్యాలయాలు తక్కువ సిబ్బందితో నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంక్‌లు, విద్యాసంస్థలు, అంగన్‌వాడీలు మాత్రం మూసేసే ఉండాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లకుండా ప్రజలు ఆన్‌లైన్ సర్వీస్‌లను వినియోగించుకోవాలని సూచించింది. కంటెయిన్మెంట్ జోన్స్‌ల నుంచి వెళ్లే బస్‌లు, వాహనాలు...వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఆగకుండా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్క్‌లు ధరించాలని చెప్పింది. కంటెయిన్మెంట్ జోన్స్‌లో శానిటైజర్‌లు వినియోగించాలని స్పష్టం చేసింది.
గబ్బిలాలు, పందులు, వైరస్ వల్ల కలుషితమైన ఆహారం తీసుకుంటే మానవులకు ఇది వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా సంక్రమిస్తుంది. భారత్ లో ఈ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించింది. ఇప్పటి వరకు నిఫా వైరస్ కు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. దీన్ని నివారించాలంటే భద్రతా చర్యలు అనుసరించాలి. వైరస్ సోకిన జంతువుల అవశేషాలు ముట్టుకోకుండా వాటిని తగులబెట్టాలి. వాటి మృతదేహాలు కాల్చడం చేయాలి. చాలా మంది వ్యక్తులు దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఎన్సెఫాలిటిస్ వస్తే నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సార్లు తగ్గినా మళ్ళీ వైరస్ సోకినట్టుగా వచ్చిన కేసులు నివేదించబడ్డాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం వీటి మరణాల రేటు 40-75 శాతంగా ఉంది. తీవ్రమైన సందర్భాల్లో ప్రజలు న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు అనుభవిస్తారు. ఎన్సెఫాలిటిస్ వస్తే మాత్రం 24 గంటల నుంచి 48 గంటల్లో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
Also Read: కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరేం కాదు, సేఫ్‌టీ లేకపోతే కంపెనీలకే నష్టం - నితిన్ గడ్కరీ