Gaganyaan Project: జీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలం అయింది…ఈ ప్రభావం గగనయాన్ ప్రాజెక్టుపై పడనుందా….
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భారీ అంచనాలతో చేపట్టిన GSLV ప్రయోగం విఫలం కావడంతో.. ఇస్రోకు గట్టి దెబ్బే తగిలిందా… ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగనయాన్‌పై ఈ ప్రభావం పడనుందా?
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ -EOS-౦౩ని కక్షలోకి చేర్చాల్సిన GSLV F-10 రాకెట్ క్రయోజనిక్ ఇంజన్ ఫెయిల్యూర్‌తో ప్రాజెక్టు విఫలమైంది. క్రయోజనిక్ ఇంజన్‌పై స్థాయిలో ఇంజన్ ఇగ్నైట్ కాకపోవడంతో ప్రయోగం పూర్తిగా ఫలించనట్లు ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. మొదటి 5 నిమిషాల్లో ప్రాజెక్టు 2 దశలను విజయవంతంగా పూర్తి చేసింది. మూడో దశలో క్రయోజనిక్ ఇంజన్ మండి మరింత వేగంగా రాకెట్‌ను ముందుకు పంపుతుంది. క్రయోజనిక్ దశ ప్రారంభమైన మొదటి సెకన్ నుంచే రాకెట్ దిశ మార్చుకుంది.
క్రయోజనిక్ -అత్యంత సంక్లిష్టం
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఉపగ్రహ ప్రయోగాలకు రెండు రకాల వాహకనౌకలను ఉపయోగిస్తుంది. అత్యంత సక్సెస్‌ఫుల్ అయిన PSLVలతో పాటు.. జియో సింక్రనోస్ లాంచ్ వెహికిల్ -GSLV లను కూడా ఉపయోగిస్తోంది. 20 ఏళ్లలో 14 GSLVలను ఇస్రో లాంచ్ చేసింది. గురువారం ఉదయం శ్రీహరికోట నుంచి లాంచ్ చేసింది 14వ GSLV ప్రయోగం. GSLV రాకెట్లలో క్రయోజనిక్ ఇంజన్లను వాడతారు. ఈ రాకెట్లలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని వాడితే మూడో స్టేజ్‌లో క్రయోజనిక్ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఇది రాకెట్‌కు అధిక వెలాసిటీని ఇవ్వడంతో పాటు... ఎక్కువ బరువును తీసుకెళ్లగలిగే శక్తి ఇస్తుంది. లిక్విడ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లను మైనస్ 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచి క్రయోజనిక్ ఇంజన్ ను రూపొందిస్తారు. దీనిని ఆ స్థాయిలో మెయింటెయిన్ చేయడం కష్టమైన పని.. భారత్ ఇప్పటి వరకూ 8 క్రయోజనిక్ ఇంజన్లను రూపొందించింది. వీటిలో చాలా వరకూ విజయవంతం అయినా కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇప్పటి వరకూ 14 రాకెట్లను లాంచ్ చేస్తే.. నాలుగు పూర్తిగానూ మరో రెండు పాక్షికంగానూ విఫలం అయ్యాయి. ఆ ఖాతాలో ఇప్పుడు మరో ఫెయిల్యూర్ చేరింది. GSLV రాకెట్ చివరిసారిగా 2010లో విఫలం అయింది.
ఇస్రోకు ఎదురుదెబ్బ- గగన్‌యాన్ ఆలస్యం
తాజా వైఫల్యంతో.. ఇస్రోకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. చంద్రయాన్ ప్రాజెక్టు పాక్షిక విజయంతో డీలా పడిన ఇస్రో.. సాధ్యమైనంత త్వరగా.. కోలుకుంది . ఆ తర్వాత కొన్ని ప్రయోగాలు విజయవంతం చేసి… త్వరలోనే మానవసహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ కోసం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వ్యామోగాములు రష్యాలో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఫెయిల్ అయిన రాకెట్ GSLV మార్క్ -2. గగన్‌యాన్ కోసం ఉపయోగించేది GSLV మార్క్ -౩. 2017లో ఇస్రో మార్క్ ౩ ని విజయవంతంగా ప్రయోగించింది. అయితే పదేళ్ల నుంచి క్రయోజనిక్ ఇంజన్లను విజయవంతం చేస్తున్న ఇస్రో ఇప్పుడు ఫెయిల్యూర్ చూసింది. ఈ ప్రభావం గగనయాన్‌పై కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ఏడాది చివరికి, వచ్చే రెండేళ్లకు మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేసింది. ఇప్పుడు అవన్నీ కూడా మరికాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.