Railway Journey Reschedule Rules: ప్లాన్ మారిందని టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. అయితే రైల్వేశాఖ మీకు గుడ్ న్యూస్
Train Journey Reschedule Rules: రైల్వే ప్రయాణం వాయిదా వేసుకోవాలంటే బుక్ అయిన టికెట్ రద్దు చేయకుండానే వేరే తేదీకి మార్చుకోవచ్చు.

Railway Journey Reschedule Rules: దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ వేలాది రైళ్లను నడుపుతోంది. తద్వారా ప్రజలు తక్కువ ఖర్చుతో సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు ప్రయాణం ఫిక్స్ చేసుకున్నాక అనుకోకుండా మీ జర్నీ ప్లాన్ మారుతుంది. అతి కష్టమ్మీద బుక్ చేసుకున్న టికెట్ రద్దు చేసుకుంటే మళ్లీ బుక్ చేసుకోవడం కష్టమే. అందుకే మీరు టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకోవలసిన అవసరం లేదని రైల్వేశాఖ చెబుతోంది. టికెట్ క్యాన్సిల్ సమస్యను పరిష్కరించడానికి, భారత రైల్వేశాఖ ఇప్పుడు ఒక కొత్త నియమాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం, మీ జర్నీ తేదీ మారితే, టికెట్‌ను క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఇదివరకు బుక్ చేసుకున్న టికెట్‌తో మరేదైనా తేదీలో ప్రయాణించవచ్చు. అయితే రైల్వేశాఖ ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. ఈ కొత్త నియమం ఎలా పని చేస్తుంది, ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
టికెట్‌ను క్యాన్సిల్ చేయకుండా ఇలా చేస్తే సరి
టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో పెద్ద మార్పులు చేయడానికి భారతీయ రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇప్పుడు ప్రయాణికులు టికెట్‌ను రద్దు చేయకుండా, వారి ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు నవంబర్ 20న రైలు టికెట్ బుక్ చేసుకుంటే, జర్నీని నవంబర్ 22కి వాయిదా వేసుకోవాల్సి వస్తే.. అదే టికెట్‌ను రీషెడ్యూల్ చేయవచ్చు. ఈ సౌకర్యం IRCTC పోర్టల్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకున్న కన్ఫర్మ్ టిక్కెట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు పాత టికెట్‌ను రద్దు చేసుకుని, కొత్త టికెట్‌ను బుక్ చేసుకుంటున్నారు. తద్వారా టికెట్ క్యాన్సిల్ ఛార్జీలు చెల్లించాలి. కొత్త రూల్ ద్వారా ఈ ఇబ్బంది ఉండదు. కొత్త తేదీలో రైలు ఛార్జీలు ఎక్కువగా ఉంటే, ప్రయాణికుడు పెరిగిన ఛార్జీల వ్యత్యాసాన్ని చెల్లించాలి. ఈ మార్పు ప్రయాణికులకు రైల్వే డిజిటల్ సేవలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
ప్రయాణికులకు ఉపశమనం
ఈ కొత్త నియమం ప్రయాణికులకు టికెట్ రద్దు చేయకుండా, వినియోగించుకునేందుకు ఉపశమనం కలిగిస్తుంది. చాలాసార్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. దీనివల్ల టికెట్‌ను రద్దు చేస్తే 25 శాతం నుండచి 50 శాతం వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరీ ఆలస్యమైతే ఎలాంటి రీఫండ్ కూడా ఉండదు. ఇకనుంచి రైల్వే ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దు చేయకుండా ప్రయాణించాలని యోచిస్తోంది. అందుకు బదులుగా ట్రావెల్ డేట్ అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది.
రైల్వేశాఖ కొత్త రూల్ ద్వారా ప్యాసింజర్స్ సమయం, డబ్బు రెండు ఆదా అవుతాయి. కొత్త తేదీలో అదే సీటు మళ్లీ కన్ఫర్మ్ అవుతుందని కాదు. సీటు లభ్యత ఆధారంగా టికెట్ నెంబర్ మారుతుంది. నివేదికల ప్రకారం, రైలు మిస్ అయిన సందర్భంలో కూడా ప్రయాణికులకు పాక్షిక రీఫండ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.






















