Guinness World Record: అతి తక్కువ సమయంలో 7 ఖండాలు చుట్టొచ్చిన భారతీయులు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బద్ధలు
ఇద్దరు భారతీయులు మాత్రం తమకు దొరికిన తక్కువ సమయాన్ని వినియోగించుకుని ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అతి తక్కువ సమయంలో ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో పర్యటించారు.
బిజీ లైఫ్ లో కాస్త తీరిక దొరికితే ఏం చేస్తారు. కొందరైతే హాయిగా నిద్రపోతాం అంటారు. మరికొందరు స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతామని చెబుతారు. ఇంకొందరైతే గత కొన్ని రోజులుగా పెండింగ్ లో పెట్టిన పనులను పూర్తి చేస్తామంటారు. కానీ ఇద్దరు భారతీయులు మాత్రం తమకు దొరికిన తక్కువ సమయాన్ని వినియోగించుకుని ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటారా. అతి తక్కువ సమయంలో ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో పర్యటించారు. అందుకే అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
డాక్టర్ అలీ ఇరానీ, సుజోయ్ కుమార్ మిత్రా అనే ఇద్దరు భారతీయులు అతి తక్కువ సమయంలో మొత్తం 7 ఖండాలలో పర్యటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించారు. వారు ఆసియా, ఆఫ్రికా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా, యూరప్, ఉత్తర అమెరికా, ఓషియానియాలలో సరిగ్గా 3 రోజుల 1 గంట 5 నిమిషాల 4 సెకన్లలో ప్రయాణించారు. దాంతో తక్కువ సమయంలో అన్ని ఖండాలను చుట్టొచ్చిన వ్యక్తులుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
డాక్టర్ అలీ, సుజోయ్ కుమార్ మిత్రాలకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. దాంతో తక్కువ సమయంలో ప్రపంచంలో అన్ని ఖండాలను చుట్టి రావాలని ప్లాన్ చేసుకున్నారు. డిసెంబర్ 4, 2022న అంటార్కిటికాలో వీరిద్దరూ తమ జర్నీని ప్రారంభించారు. డిసెంబర్ 7, 2022న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో తమ 7 ఖండాల పర్యటనను విజయవంతంగా ముగించారు. పర్యటనలు ఇష్టపడే ఈ ఇద్దరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రికార్డులు బద్దలు కొట్టవచ్చని భావించి సరిగ్గా అదే చేసి చూపించారు.
View this post on Instagram
తక్కువ సమయంలో అన్ని ఖండాలలో పర్యటించిన ఈ ఇద్దరూ తమ విజయంపై మాట్లాడుతూ.. ఈరోజు మేం రికార్డ్‌ను బద్దలు కొట్టడంలో విజయం సాధించాం. కానీ భవిష్యత్ లో మరొకరు మా రికార్డును బద్దలు కొడతారు" అని రికార్డ్ కీపింగ్ కంపెనీ ద్వారా వెల్లడించారు.
డాక్టర్ ఇరానీ ఫిజియోథెరపీలో ప్రసిద్ధి చెందారు. భారత క్రికెట్ జట్టుతో ఆయన అనుబంధం కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఈ ఏడాది అత్యుత్తమ వార్తలలో ఇది ఒకటి అని నెటిజన్స్ వీరి విజయంపై స్పందిస్తున్నారు. కష్టసాధ్యమైన విషయాన్ని మీరు తక్కువ సమయంలో చేసి చూపించారు అభినందనలు అని నెటిజన్లు వీరిద్దరి గిన్నిస్ వరల్డ్ రికార్డుపై కామెంట్ చేస్తున్నారు.
ఏడు ఖండాలలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు గతంలో యూఏఈకి చెందిన డాక్టర్ ఖవ్లా అల్ రొమైతి పేరిట ఉండేది. అతడు 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లలో ప్రపంచంలోని అన్ని ఖండాలలో పర్యటించి ఈ ఫీట్ సాధించాడు. గత నెలలో భారత్ కు చెందిన సుజోయ్, డాక్టర్ అలీ ఇరానీలు 3 రోజుల 1 గంట 5 నిమిషాల 4 సెకన్లలో రికార్డ్ జర్నీని ముగించారు.