Indian Army: ఆర్మీ స్కూల్ విద్యార్థులే టార్గెట్- వాట్సాప్ గ్రూప్‌లతో వల వేస్తున్న పాకిస్థాన్
పాకిస్తాన్ మరో సారి తన వక్రబుద్ధి బయటపెట్టుకుంది. భారత్‌ను దెబ్బదీసేందుకు ఎన్ని రకాలు సాధ్యమయితే అన్ని రకాలుగా యత్నిస్తోంది. తాజాగా భారత్ ఆర్మీ స్కూళ్లు లక్ష్యంగా పాకిస్తాన్ కుట్రలకు తెరతీసింది.
పాకిస్తాన్ మరో సారి తన వక్రబుద్ధి బయటపెట్టుకుంది. భారత్‌ను దెబ్బదీసేందుకు ఎన్ని రకాలు సాధ్యమయితే అన్ని రకాలుగా యత్నిస్తోంది. తాజాగా భారత్‌లోని ఆర్మీ స్కూళ్లు లక్ష్యంగా పాకిస్తాన్ కుట్రలకు తెరతీసింది. విద్యార్థులకు వాట్సప్ ఎర వేస్తోంది. పాక్ కుట్రలను గుర్తించిన ఇండియన్ ఆర్మీ భారత విద్యార్థులు ట్రాప్‌లో పడకుండా పలు సూచనలు, సలహాలను జారీ చేసింది. భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs) నుంచి కాల్స్, వాట్సప్ మెస్సేజులు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీపేరుతో విద్యార్థులు కొన్ని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని కోరుతున్నారు. ముఖ్యంగా 8617321715, 9622262167 నుంచి కాల్స్, మెస్సేజ్ చేస్తూ సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నారు. భారత ఆర్మీ పాఠశాలల విద్యార్థులే లక్ష్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేసిన ఈ కొత్త తరహా కుట్రలను సైతం ఇండియన్ ఆర్మీ నిర్ధారించింది.
టీచర్ల పేరుతో ఫోన్ కాల్స్
పాకిస్థాన్ నిఘా వర్గాలకు చెందిన వ్యక్తులు ఉపాధ్యాయులుగా నటిస్తూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫోన్లు చేయడంతో పాటు వాట్సాప్ మెస్సేజులు పెడుతున్నారు. క్లాస్ రూంకు సంబంధించిన గ్రూపులు, కుటుంబ సభ్యులు, సాంకేతిక అంశాల గ్రూపులుగా పేర్కొంటూ వాటిలో చేరాలని సూచిస్తున్నారు. విద్యార్థులను నమ్మించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులకు నమ్మకం కలిగించేందుకు తెలిసిన ప్రముఖ వ్యక్తులు, తెలిసిన వాటిని రెఫరెన్స్‌గా పేర్కొంటున్నారు. ఈ మేరకు ఓటీపీలు, గ్రూపు లింకులు పంపిస్తున్నారు. విద్యార్థులకు నమ్మకం కలిగాక పాక్ నిఘా వర్గాలు తమ పని మొదలు పెడుతున్నారు. ఒక్కసారి గ్రూప్ లో చేరిన తర్వాత సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని అడుగుతున్నారు.
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ జారీ చేసిన ఒక అడ్వైజరీ ప్రకారం.. భారత విద్యార్థుల నుంచి వారి తండ్రి ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు, పాఠశాలలో విద్యార్థుల దినచర్యక ఏంటి, పాఠశాలలు పనిచేసే సమయం, పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు? వారి పేర్లు, హోదా, విద్యార్థులు ధరించే యూనిఫాం ఎలా ఉంటుంది? మొదలైన వివరాలను పాక్ నిఘా వర్గాలు అడుగుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆర్మీ పలు సూచనలు చేసింది. పాఠశాలలు, కళాశాలలు ఉపాధ్యాయులు ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆర్మీ అధికారులు సూచించారు. ఎలా ట్రాప్ చేస్తారు? వాటి బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలో విద్యార్థులకు సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్‌పై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తెలియని నెంబర్లు లేదా, కొత్త నెంబర్ల నుంచి కాల్స్, మెస్సేజులు వస్తే స్పందించొద్దని చెబుతున్నారు. తెలియని వాట్సప్ గ్రూపుల్లో చేరొద్దని హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని అనుమాస్పద కాల్స్, మెస్సేజ్‌లు వచ్చిన వెంటనే అధికారులకు గానీ, స్కూల్ యంత్రాంగానికి కానీ తెలియ జేయాలని సూచించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial