Cyber Security: భారత్‌లో పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్తవి, త్వరలోనే కేంద్రం కీలక నిర్ణయం- రీజన్ ఇదే
చైనాకు చెందిన సిమ్ చిప్ సెట్ల ద్వారా దేశ వినయోగదారుల సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉందని, సైబర్ సెక్యూరిటీ ముప్పు తప్పించుకునేందుకు పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్తవి తెచ్చే అవకాశం ఉంది.

New SIM Cards in India | దేశ వ్యాప్తంగా సిమ్ కార్డులను కొత్త సిమ్ కార్డులతో రీప్లేస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన చిప్ సెట్‌లు వినియోగదారుల సమాచారం సేకరించే అవకాశం ఉందని దేశంలోని టాప్ సైబర్ భద్రతా సంస్థ దర్యాప్తులో గుర్తించారు. ఇదే విషయాన్ని ఇద్దరు అధికారులు అనధికారికంగా చెప్పడంతో త్వరలో జరగబోయే మార్పులపై చర్చ జరుగుతోంది.
నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (NCSC), హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన దర్యాప్తులో జాతీయ భద్రతా సమస్యకు సిమ్ చిప్ సెట్ కారణం అవుతాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా మొబైల్ ఫోన్‌లలో పాత సిమ్ (subscriber identity module) కార్డులను మార్చే అవకాశం ఉంది. చట్టపరమైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం యోచిస్తోంది.
సైబర్ సెక్యూరిటీ ముప్పు..
సిమ్ కార్డుల వంటి టెలికాం వనరుల ద్వారా చైనా సంస్థలు భారత వినియోగదారుల సమాచారాన్ని సేకరించడం ద్వారా సైబర్ ముప్పు పొంచి ఉంది. కనుక పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్తవి తేవాలని NCSC టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్‌లు, టెలికమ్యూనికేషన్స్ శాఖల అధికారులతో ఇటీవల సమావేశాలు నిర్వహించింది. NCSC, హోం మంత్రిత్వ శాఖ, DoT, టెలికాం ఆపరేటర్లకు ఇమెయిల్ చేసిన ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు.
భారత్‌లో 1.15 బిలియన్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే చైనా నుంచి వచ్చిన సిమ్ చిప్ సెట్‌లలో డేటా సేకరించే కుట్ర జరుగుతోందని, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కేంద్రం భావవిస్తోంది. హువావే, ZTE వంటి చైనా పరికరాల తయారీదారులను ప్రభుత్వం ఇదివరకే నిషేధించింది. కానీ ప్రభుత్వ అనుమతి లేకుండా చైనా నుండి సిమ్ చిప్‌సెట్‌లు దేశంలోకి ఎలా వస్తున్నాయనే దానిపై ఫోకస్ చేసింది. కొన్ని టెలికాం ఆపరేటర్లు తమకు ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. సిమ్ చిప్ సెట్స్ ఎక్కడినుంచి వస్తున్నాయని ఆడిట్ చేయడం, పరిశీలించగా కొన్ని చిప్‌లు చైనా నుంచి వచ్చినవని దర్యాప్తులో తేలింది.
జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కింద NCSC పనిచేస్తుంది. జాతీయ భద్రత, వ్యూహాత్మక విషయాలపై ప్రధాన మంత్రి కార్యాలయానికి సలహా ఇస్తుంది. అయితే టెలికాం ఆపరేటర్లు చైనా నుంచి సిమ్ చిప్ సెట్లు దిగుమతి చేసుకుంటే దాని ద్వారా మన వినియోగదారుల సమాచారం ఆ దేశానికి చేరే అవకాశం ఉంది. కొన్ని టెలికాం సంస్థలు నిర్ధారణ లేని చిప్ కంపెనీల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయకూడదు. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ (TEC) చిప్ సెట్ లాంటి పరికరాలను వెరిఫై చేస్తుంది.
ఆపరేటర్లకు అదనపు ఖర్చు
చైనా నుంచి చిప్ సెట్లు దేశంలోకి వస్తున్నాయని, ఇదివరకే డేటా వెళ్లిందన్న ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో కేంద్రం అప్రమత్తమైంది. పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్త సిమ్ కార్డులు తీసుకురావాలని టెలీ కమ్యూనికేషన్ శాఖ భావిస్తోంది. త్వరలోనే దీనిపై టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారని ఆ అధికారులు తెలిపారు. మార్చి 2021లో విశ్వసనీయత లేని విక్రేతల నుండి ఎలాంటి కొనుగోలు చేయవద్దని లైసెన్సులో మార్పులు చేసింది. టెలికాం చట్టం 2023 ప్రకారం విశ్వసనీయ కంపెనీల నుంచి మాత్రమే పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ కానున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

