(Source: ECI/ABP News/ABP Majha)
Jan Vishwas Rally: సంపన్నుల కోసమే బీజేపీ ప్రభుత్వం పనులు, ఎన్నికల శంఖారావం పూరించిన ‘ఇండియా’ కూటమి
ముగ్గురు సంపన్నుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ‘ఇండియా’ కూటమి... ఎన్నికల శంఖారావం పూరించింది.
JanViswas Maha Rally in Patna: ముగ్గురు సంపన్నుల కోసమే బీజేపీ (Bjp)ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు ( Lok Sabha Elections 2024)సమీపిస్తున్న వేళ విపక్ష ‘ఇండియా’ కూటమి (I.N.D.I.A Alliance) ఎన్నికల శంఖారావం పూరించింది. బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఇండియా’ కూటమి జన విశ్వాస్ మహా ర్యాలీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దేశ్ బచావో, బిజెపి హటావో అంటూ ‘ఇండియా’ కూటమి నేతలు నినదించారు.
బిహార్ దేశ రాజకీయ నాడి..
బిహార్‌ను దేశ రాజకీయ నాడిగా అభివర్ణించిన రాహుల్ గాంధీ.... దేశంలో పరివర్తన జరిగినప్పుడల్లా, అది బిహార్ నుంచి ప్రారంభమైందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ... ‘ఇండియా’ కూటమి సభలో మాట్లాడారు. దేశంలో సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందన్న ఆయన... ఒక పార్టీ విద్వేషాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, తాము మాత్రం ప్రజలకు ప్రేమను అందిస్తున్నామని అన్నారు. ఒకవైపు ద్వేషం, హింస, అహంకారం ఉంటే...మరోవైపు ప్రేమ, గౌరవం, సౌభ్రాతృత్వం ఉన్నాయని... భారత కూటమిని ఒక్క వాక్యంలో అర్థం చేసుకోవచ్చన్నారు రాహుల్ గాంధీ. ద్వేషానికి అతి పెద్ద కారణం అన్యాయమన్న ఆయన... అగ్నివీర్ పథకంతో దేశంలోని యువతకు అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం... ఇద్దరు ముగ్గురు సంపన్నుల కోసం పని చేస్తోందన్నారు రాహుల్ గాంధీ. జనాభాలో 73 శాతం ఉన్న దళితులు, వెనుకబడిన తరగతులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
వాళ్లు బీజేపీతో పోరాటం చేయలేరన్న ఖర్గే
సైద్ధాంతికంగా బలంగా లేని వ్యక్తులు బీజేపీతో పోరాటం చేయలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్లు వేశారు. నితీష్ కుమార్ మళ్లీ తిరిగి వస్తే కలసి పని చేయవద్దని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు సూచించారు. డిప్యూటీ సీఎంగా పని చేసిన తేజస్వి యాదవ్...17 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించారని తేజస్వి యాదవ్‌ను ఖర్గే ప్రశంసించారు. యూపీ, బిహార్ రాష్ట్రాల్లోనే 120 ఎంపీ స్థానాలున్నాయని... ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే... ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
మోదీ నిజమైన హిందువు కాదన్న లాలు!
తాను ఎప్పుడు సీఎం నితీష్ కుమార్ ను దుర్భాషలాడలేదన్నారు RJD అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఫాల్తురామ్ అని మాత్రమే పిలిచానన్న ఆయన... నితీష్ కుమార్ చేసే పనుల కారణంగానే ఆయనకు ఆ లేబుల్ వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో నితీష్ కుమార్ పై ఎన్నో వీడియోలు, మీమ్స్ వచ్చాయన్నారు. నరేంద్ర మోదీకి సొంత కుటుంబం లేకపోతే మనం ఏమి చేయగలమన్న ఆయన.. రామమందిరం గురించి గొప్పగా చెప్పుకుంటాడని వ్యాఖ్యానించారు. మోదీ నిజమైన హిందువు కాదన్న లాలు ప్రసాద్... హిందూ సంప్రదాయంలో, ఒక కొడుకు తన తల్లితండ్రులు మరణించిన తర్వాత తప్పనిసరిగా తలనీలాలు, గడ్డం తీయాలన్నారు. అయితే తన తల్లి చనిపోయినప్పుడు మోదీ అలా చేయలేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు బడా వ్యాపారులకు మాత్రమే మేలు చేస్తున్నాయని వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి రాజా ఆరోపించారు.