కేంద్రం చేపట్టే నగదు బదిలీ, సంక్షేమ పథకాలపై ఐఎంఎఫ్ ప్రశంసలు
కేంద్రం చేపడుతున్న పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించింది. నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతోందని అభిప్రాయపడింది.
Direct Cash Transfer: నగదు బదిలీ పథకం ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో ఇదో ట్రెండ్‌సెటర్. సంక్షేమం అవసరమైన లబ్ధిదారులకు వస్తురూపంలో లేదా మరే ఇతర మార్గాల్లో ఇవ్వడం కంటే నేరుగా నగదు రూపంలో వారి ఖాతాల్లో వేస్తున్నారు. దీని వల్ల నేరుగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతురాని ప్రభుత్వాల ఆలోచన. ఇప్పుడు చాలా ప్రభుత్వాలు దీన్నే ఆచరిస్తున్నాయి.
ముఖ్యంగా కేంద్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, నగదు బదిలీ పథకాలు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్ నుంచి చాలా నేర్చుకోవాలంటోంది అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్). ఐఎంఎఫ్ ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్ట్ పాలో మౌరో మాట్లాడుతూ... నగదు బదిలీ పథకంలో భారత్ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసల జల్లు కురిపించారు. సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది అల్ప ఆదాయ వర్గాల వారికి సాయం అందించడం అద్భుతమన్నారు.
ఆధార్ వ్యవస్థను ఉపయోగించి నగదు బదిలీ పథకకం అమలు విజయవంతం చేయడం చిన్న విషయం కాదన్నారు పాలో మౌరో. మహిళలు, వృద్ధులు, రైతులు నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందుకొని ఎంతో ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద లబ్ధిదారులకు నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఇది కరోనా ప్రారంభమైనప్పటి నుంచి చేపట్టిన కార్యక్రమం. దీన్ని ఈ మధ్య కాలంలోనే 2022 డిసెంబర్ వరకు పొడిగించారు. ఈ పథకం ద్వార 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కరోనా టైంలో జన్‌ధన్ ఖాతాల్లో పేద మహిళలకు 500 రుపాయలు జమ చేసింది ప్రభుత్వం. వీటన్నింటిపై ఐఎంఎఫ్ ప్రశంసల జల్లు కురిపించింది.