Kejriwal: ప్రజలకు డబ్బు ఆశ చూపుతున్నారు.. నేను రాత్రంతా నిద్రపోలేదు: కేజ్రీవాల్
Delhi Elections 2025 | తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ బీజేపీ గూండాయిజం చేస్తోందని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.

Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ ఎలక్షన్లు జరుగనున్నాయి. నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీ, అధికార ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ బీజేపీ గూండాయిజం చేస్తోందని మండిపడ్డారు. ఓటర్లకు డబ్బులు ఎరగా చూపి ఓట్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
షాక్‌కు గురయ్యా..
కేజ్రీవాల్ ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని స్లమ్స్ నుంచి అనేక కాల్స్ రావడం చూసి షాక్‌కు గురయ్యానని అన్నారు. ‘స్లమ్స్‌లో ఉన్న ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని, ప్రతిఫలంగా రూ.3,000 తీసుకోవాలని ప్రజలను అడుగుతున్నారు. ఈ విషయంపై స్లమ్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఇది విన్న నేను షాక్ అయ్యాను. నిన్న రాత్రంతా నిద్ర పోలేదు’ అని కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకోండి కానీ వారికి ఓటేయొద్దు
బీజేపీ నేతలు ప్రజలను ట్రాప్ చేసే కుట్ర పన్నుతున్నారని, వారి వలలో పడవద్దని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఓ పెద్దన్నలా మిమ్మల్ని కోరుతున్నానని అన్నారు. వారు చెప్పిన విధంగా డబ్బులు తీసుకొని గనక ఓటు వేస్తే తిరిగి మీమీదే వారు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తారని అన్నారు. బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకోండి కానీ వారికి ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు.
బెదిరింపులకు మేం భయపడం
‘దిల్లీలో జరిగే ఎన్నికల్లో ఆప్ విజయం దిశగా పయనిస్తోంది. ఇది భాజపా నాయకులను.. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ను నిరాశకు గురిచేస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు ఆప్ కార్యకర్తలపై బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడం. ఆ పార్టీకి దిల్లీ అభివృద్ధిపై అజెండా లేదు. వారికి కేవలం గూండాయిజం మాత్రమే తెలుసు. దిల్లీ ప్రజలంతా ఎన్నికల్లో భాజపాను ఓడించి బుద్దిచెప్పాలి’ అని ఢిల్లీ మాజీ సీఎం అన్నారు.
ఎలక్షన్ కమిషన్‌కు లేఖ
తమ పార్టీ నేతలపై బీజేపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఎన్నికల కమిషన్‌కు కేజ్రీవాల్ లేఖ రాశార. ఈ లేఖలో ఆప్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలు బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘మా వాలంటీర్లను బెదిరింపులు, వేధింపులకు గురిచేయడం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నా. శనివారం మా సీనియర్ వాలంటీర్ చేతన్ సెక్షన్ 126 కింద తిలక్ మార్గ్‌లో అతడిని నిర్బంధించారు. అతడిపై కేసు బుక్ చేశారు. ఈ పరిణామాలతో స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్‌కు తరలించారు’ అని లేఖలో పేర్కొన్నారు.
తప్పుడు వార్తలు క్రియేట్ చేసేందుకు కేజ్రీవాల్ వెనుకాడడు
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్రంగా స్పందించారు. తప్పుడు వార్తలు క్రియేట్ చేసేందుకు కేజ్రీవాల్ ఏనాడు వెనకాడడని అన్నారు. ఆయన ప్రభుత్వంలోని ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

