Hyderabad Woman: డిప్రెషన్‌కు గురై అమెరికాలో రోడ్డునపడ్డ హైదరాబాద్ యువతి, సాయం చేయాలని జైశంకర్‌కు తల్లి లేఖ
Hyderabad Woman: హైదరాబాద్ కు చెందిన ఓ యువతి అమెరికాలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. డిప్రెషన్ కు గురై రోడ్డున పడింది.
Hyderabad Woman: ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన ఓ యువతి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చికాగో వీధుల్లో ఆకలి కేకలతో అలమటిస్తోంది. కొన్ని నెలలుగా హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులతోనూ తన మాట్లాడటం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన గురయ్యారు. అమెరికాలో, చికాగోలో ఉన్న పలువురి విషయం చెప్పగా.. కొందరికి తను కనిపించిందని వాళ్లు ఆ యువతి తల్లికి సమాచారం ఇచ్చారు. తను డిప్రెషన్ కు గురైందని, అలాగే ఆమె సామాన్లను ఎవరో దొంగలించారని, చికాగో వీధుల్లో ఆకలితో అలమటిస్తోందని వారు ఆ యువతి తల్లితో చెప్పారు. తమకు సాయం చేయాలని ఆ యువతి తల్లి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు.
జైదీని గుర్తించిన హైదరాబాద్ యువకులు
హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి.. డెట్రాయిట్ లోని ట్రైన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. అక్కడి వెళ్లిన తర్వాత జైదీ తరచూ హైదరాబాద్ లో ఉంటున్న తన తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్ లో మాట్లాడే వారు. అంతా సవ్యంగానే సాగుతున్న తరుణంలో.. ఉన్నట్టుండి జైదీ నుంచి కాల్స్, మెసేజీలు రావడం మానేశాయి. వీరు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిసిన వారికి ఫోన్ చేసి కూతురి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారు కూడా తమకేం తెలియదని చెప్పారు. అలా అందరినీ తన కుమార్తె గురించి అడగడం మొదలు పెట్టారు జైదీ తల్లి సయ్యదా. అలా హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని చికాగోలో గుర్తించారు. జైదీ తీవ్రమైన డిప్రెషన్ కు గురైందని, తన వస్తువులను కూడా ఎవరో దొంగలించారని, ఆమె చికాగో వీధుల్లో తిరుగుతూ ఆకలితో అలమటిస్తున్నట్లు వారు సయ్యదాకు ఫోన్ చేసి చెప్పారు.
సాయం చేయాలంటూ విదేశాంగ మంత్రికి లేఖ
కూతురు జైదీని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు తల్లి సయ్యదా ప్రయత్నించడం మొదలు పెట్టారు. అందులో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు లేఖ రాశారు. తన కూతురు డిప్రెషన్ కు గురై చికాగో వీధుల్లో ఆకలితో అలమటిస్తోందని.. తనను ఎలాగైనా స్వదేశానికి తీసుకు రావాలని సయ్యదా విదేశాంగ మంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, చికాగో లోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని అభ్యర్థించారు. మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. అలా ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.
Request @DrSJaishankar to kindly look into it.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD https://t.co/rwtevJ1fWr
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 26, 2023