keravan Kerala : టూరిజంలో నయా ట్రెండ్ - కారవాన్ టూరిజాన్ని ప్రారంభించిన కేరళ
Caravan Kerala : పర్యాటకలను ఆకర్షించేందుకు కేరళ టూరిజం శాఖ సరికొత్త ఆలోచన చేసింది. కారవాన్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు కేరళను హనీమూన్ డెస్టినేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Caravan Kerala : పర్యాటకులను ఆకర్షించేందుకు కేరళ పర్యాటకశాఖ(Kerala Tourism) వినూత్న ఆలోచన చేసింది. తాజాగా తెలుగు పర్యాటకులే లక్ష్యంగా హైదరాబాద్(Hyderabad) ది పార్క్ హోటల్ లో పార్ట్నర్ షిప్ మీట్ నిర్వహించారు. కేరళ పర్యాటకశాఖ డైరెక్టర్ వీఆర్ కృష్ణతేజ(Krishna Teja) పాల్గొన్న ఈ సమావేశంలో కేరళ పర్యాటకశాఖ ప్రత్యేకతలు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు అందుబాటులోకి తెస్తున్న కారవాన్ టూరిజం(Caravan Tourism)పై అవగాహాన కల్పించారు. కరోనా ప్రభావం తగ్గడంతో పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం పర్యాటకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా విదేశాల నుంచి కేరళకు వచ్చే పర్యాటకులు పద్నాలుగు రోజుల నుంచి నెల రోజులపాటు కేరళలో గడుపుతుంటే, దేశీయ పర్యాటకులు(Tourists) మాత్రం నాలుగు రోజులు మాత్రమే కేరళలో బసచేస్తున్నారట. ఈ విషయంపై ఫోకస్ పెట్టిన కేరళ పర్యాటకశాఖ ఇకపై నాలుగు కాదు వారం రోజులు ఉండేలా చేసేందుకు ఆహ్లాదకరమైన కేరళ అందాలను మరచిపోలేని పర్యాటక అనుభూతిని చూపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
(కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్ కృష్ణతేజ)
కారవాన్ కేరళతో ప్రణాళిక
పర్యాటకుల అభిరుచులు, అభిప్రాయాలు మారుతున్నాయి. పక్కా ప్లాన్ గా పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు కేరళ పర్యాటకశాఖ గతంలో ఎప్పుడూ లేనట్లుగా హోమ్ స్టేలు(Home Stays), డ్రైవ్ హాలిడేలు, ఛేంజ్ ఆఫ్ ఎయిర్ , అడ్వెంచర్ టూరిజం(Adventure Tourism) ఇలా అద్భుతమైన ప్రణాళికతో పర్యాటకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పర్యాటకుల కోసం హౌస్ బోట్ లు, కారవాన్ లు, జంగిల్ లాడ్జీలు, తోటల సందర్శనలు, హోమ్ స్టేలు, ఆయుర్వేద ఆధారిత వెల్ నెస్ సొల్యూషన్, గ్రామీణ ప్రాంతాల్లో వాకింగ్, పచ్చని కొండలపై ట్రెక్కింగ్ వంటి అద్భుతమైన సాహస కార్యకలాపాలు అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ కేరళ వెళ్లే పర్యాటలకు విభిన్న అనుభవాలను అందించనున్నాయి. దీంతోపాటు కారవాన్ కేరళ అంటూ సరికొత్తగా కారవాన్ టూరిజం మొదలుపెట్టింది.
హనీమూన్ డెస్టినేషన్ చేసేందుకు ప్రమోషన్స్
అంతేకాదు కేరళ ప్రభుత్వం పర్యాటకులకు కోసం వినూత్న ప్రయత్నాన్ని మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని సరికొత్త పర్యాటక ప్రాంతాలను అన్వేషించే పనిలోపడింది. రాష్ట్రాన్ని సురక్షితమైన ఆకర్షణీయమైన హనీమూన్(Honeymoon) ప్రదేశంగా ప్రమోట్ చేయడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి మైక్రో వీడియో పాటలను మొదలుపెట్టింది. వీటితో పాటు కొత్త ఉత్పత్తులను సందర్శకులకు పరిచయం చేయడానికి ట్రేడ్ ఫెయిర్ లలో పాల్గొనడం, బి2బి భాగస్వామ్య సమావేశాలు రోడ్ షోలు నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇలా రాబోయే నాలుగు నెలల్లో ప్రధాన అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలను నిర్వహించేందుకు కేరళ సిద్ధమైంది. అంతేకాదు టీటీఎఫ్ చెన్నై సౌత్ ఏషియన్ ట్రావెల్ టూరిజం ఎక్సైంజ్, న్యూదిల్లీ లాంటి దేశీయ సమావేశాల్లో కేరళ పర్యాటక గొప్పతనాన్ని ఆవిష్కరించేందుకు కేరళ సిద్ధంగా ఉంది. ఇలా కేరళ టూరిజం సరికొత్తగా పర్యాటకులను ఆకర్షించడంలో ముందంజలో ఉన్నామంటున్నారు కేరళ టూరిజం డైరెక్టర్ కృష్ణతేజ.