Amit Shah On 2024 Elections: 300లకు పైగా సీట్లతో మరోసారి బీజేపీదే అధికారం - మోదీయే ప్రధాని: షా
Amit Shah On 2024 Elections: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలిచి మరోసారి మోదీ ప్రధాన అవుతారని అమిత్ షా అన్నారు. అలాగే మణిపూర్ లో శాంతి నెలకొనాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Amit Shah On 2024 Elections: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ౩౦౦ సీట్లకుపైగా గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నన్ని సీట్లు కూడా రావని షా అన్నారు. గౌహతిలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ కు అమిత్ షా శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బహిష్కరించి రాజకీయాలు చేస్తోంది మండిపడ్డారు. కాంగ్రెస్ వి చౌకబారు రాజకీయాలని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా మణిపూర్ లో తలెత్తిన హింసాత్మక ఘటనలపై స్పందించిన అమిత్ షా.. నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ లో శాంతి నెలకొనాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. త్వరలోనే మణిపూర్ కు వచ్చి మూడు రోజులు అక్కడే ఉంటానని అమిత్ షా తెలిపారు. వివాదాలు అన్నీ పరిష్కరించేందుకు, శాంతి స్థాపన కోసం ఇరు వర్గాల వారితో మాట్లాడతానని, అప్పటి వరకు అందరూ శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.
నివురుగప్పిన నిప్పులా మణిపూర్
మణిపూర్ లో చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి తెగల మధ్య నెలకొన్న వైరమే. రాష్ట్రంలో మెజారిటీ మెయిటీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజనులు ఆందోళనలు చేపట్టారు. గిరిజనులు నిర్వహించిన సంఘీభావయాత్ర కాస్త హింసాత్మకంగా మారింది. కొన్ని రోజుల పాటు మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. ఈ ఘటనల్లో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులను, సైన్యాన్ని మోహరించి పరిస్థితులను శాంతింపజేశారు.
మూడ్రోజుల క్రితం మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఓ స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇంఫాల్ లోని న్యూ చెకాన్ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దాంతో వెంటనే సర్కారు భద్రతా బలగాలను మోహరించి మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఈ హింస ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఉన్నపళంగా అంతర్జాల సేవలను నిలిపివేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు.. ఆర్మీ, అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసు బలగాలను మోహరించారు. గత నెలలో జరిగిన అల్లర్లకు మణిపూర్ లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్ పుర్ కేంద్ర బిందువుగా ఉంది. కొద్దిరోజుల క్రితం సీఎం బీరేన్ సింగ్ పాల్గొనాల్సిన సభా వేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిగిన హింస ఇంఫాల్ లో చోటుచేసుకున్నాయి.
Also Read: Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింస, భద్రతా బలగాల మోహరింపు
మణిపూర్ ఘటనలపై కాంగ్రెస్ ఏం చెబుతోంది?
మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర సర్కారు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర సర్కారు సీరియస్ గా తీసుకోవాలని పార్టీ పేర్కొంది. మణిపూర్ లో పరిస్థితిని సమీక్షించేందుకు పార్టీ ఇటీవల ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీని అక్కడికి పంపింది. మణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 54 వేల మంది నిరాశ్రయులయ్యారని, 20 పోలీస్ స్టేషన్లను తగులబెట్టారని, 2 వేల ఇళ్లు దగ్ధమయ్యాయని కాంగ్రెస్ తెలిపింది. హింసాకాండలో 6 వేల రౌండ్ల మందుగుండు సామగ్రి, వెయ్యి సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ ఆయుధాలు లూటీ చేశారని పేర్కొంది. 5 దేవాలయాలు, 200 చర్చిలు దగ్ధమైనట్లు తెలిపింది.