H3N2 Influenza Virus : పంజా విసురుతున్న హెచ్3 ఎన్2 వైరస్, పుదుచ్చేరిలో 79 కేసులు
H3N2 Influenza Virus : దేశంలో హెచ్3 ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్నాయి. పుదుచ్చేరిలో ఇప్పటి వరకూ 79 కేసులు నమోదు అయ్యాయి.
H3N2 Influenza Virus : దేశంలో హెచ్3 ఎన్ 2 వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పుదుచ్చేరిలో ఇప్పటివరకు హెచ్3ఎన్2 సబ్ టైప్ కు చెందిన 79 ఇన్‌ఫ్లుఎంజా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య అధికారి శనివారం తెలిపారు. పుదుచ్చేరిలో మార్చి 4 వరకు 79 సీజనల్ ఇన్‌ఫ్లుఎంజాకు చెందిన హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయని, అయితే ఇప్పటి వరకు వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలు భయాందోళన చెందవద్దని సూచించారు. పెరుగుతున్న కేసులను నియంత్రించడానికి ఆరోగ్య శాఖ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ విభాగాల్లో ప్రత్యేక బూత్‌లు ప్రారంభించామని, ఇన్‌ఫ్లుఎంజా వైరస్ లక్షణాలునబయటపడిన వారికి చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు.
మార్చి చివరికి కేసులు తగ్గుముఖం
వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా అన్ని నివారణ చర్యలు తీసుకున్నామని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీరాములు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... వైరస్ వ్యాప్తిని నివారించేందుకు చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు. కోవిడ్ మహమ్మారికి సిఫార్సు చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని ప్రజలను కోరారు. మార్చి చివరి నాటికి హెచ్3ఎన్2 కేసులు తగ్గుముఖం పడతాయని ఐసీఎంఆర్ నివేదిక సూచించిందని ఆయన అన్నారు. US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, H3N2 అనేది మానవేతర ఇన్‌ఫ్లుఎంజా వైరస్. ఇది సాధారణంగా పందులలో వ్యాపిస్తుంది. మానవులకు సోకుతుంది. లక్షణాలు కాలానుగుణంగా ఫ్లూ వైరస్ మాదిరిగానే ఉంటాయి. జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి శ్వాసకోశ లక్షణాలు, ఒళ్లు నొప్పి, వికారం, వాంతులు లేదా అతిసారం ఇతర లక్షణాలు ఉండవచ్చు.
ఇద్దరు మృతి
దేశంలో పలు చోట్ల ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కొందరు తీవ్ర జ్వరంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలను ఈ ఫ్లూ ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే కలవర పెడుతుంటే ఇప్పుడు మరో వార్త షాక్‌కు గురి చేసింది. H3N2 వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. హరియాణాలో ఒకరు, కర్ణాటకలో మరొకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మార్చి 1వ తేదీన 82 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్ సోకి మృతి చెందినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 90 H3N2 వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు మరో 8 H1N1 వైరస్ కేసులూ వెలుగులోకి వచ్చాయి. కొద్ది నెలలుగా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాదాపు అన్ని ఇన్‌ఫెక్షన్లకూ కారణం... H3N2 వైరసేనని వైద్యులు చెబుతున్నారు. దీన్నే Hong Kong Fluగా పిలుస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారే ఎక్కువగా ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటి వరకూ ఈ రెండు వైరస్‌లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఈ రెండింటి వైరస్‌ల లక్షణాలు దాదాపు కొవిడ్ సింప్టమ్స్ లానే ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 68 లక్షల మంది మృతి చెందారు. రెండు సంవత్సరాల పాటు కరోనా పట్టి పీడించింది. ఇప్పుడు కొత్తగా ఈ వైరస్‌లు దాడి చేస్తున్నాయి.