గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు
కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల నిల్వలు, ధరల)పై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మరో ఐదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో, ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
సార్వత్రిక ఎన్నికల( LOksabha Elections-2024)కు ముందు కేంద్ర ప్రభుత్వం (Central Government) నిత్యావసరాల నిల్వలు(Stock), ధరల( Prices )పై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మరో ఐదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో, ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సర్కార్.. తాజాగా గోధుమ నిల్వల (Wheat Stocks)పై ఆంక్షలను కఠినతరం చేసింది. ఆహార ద్రవ్యోల్బణ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. టోకు, రిటైల్, బిగ్ చైన్ రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వల పరిమితిని మరింత కుదించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆహార శాఖ స్పష్టం చేసింది. గోధుమల నిల్వలపై వ్యాపారులకు పరిమితి (Wheat Stock limits) విధించింది. టోకు వ్యాపారులకు 2 వేల టన్నుల నుంచి వెయ్యి టన్నులకు కుదిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రిటైలర్లకు ఈ మొత్తాన్ని పది టన్నుల నుంచి ఐదు టన్నులకు కుదించింది. అలాగే బిగ్ చైన్ రిటైలర్లకు ఒక్కో డిపోపై ఐదు టన్నుల చొప్పున, వారి అన్ని డిపోల్లో 1,000 టన్నుల పరిమితిని నిర్దేశించింది.
తాజా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తొలిసారి గోధుమ నిల్వలపై ఆంక్షలు విధిస్తూ జూన్ 12న ప్రభుత్వం ప్రకటన చేసింది. మార్చి 2024 వరకు వాటిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. గోధుమలను ప్రాసెసింగ్ చేసేవారు నెలవారీ సంస్థాగత సామర్థ్యంలో 70 శాతం నిల్వ చేసుకోవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కృత్రిమ కొరతను సృష్టించి అక్రమంగా ధరలను పెంచేందుకు చేస్తున్న యత్నాలను అరికట్టడం కోసమే పరిమితులు విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న నిల్వలను తాజా పరిమితుల మేరకు సర్దుబాటు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. గోధుమలను నిల్వ చేసుకునే అవసరం ఉన్న సంస్థలన్నీ, ప్రభుత్వ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ప్రతి శుక్రవారం నిల్వల స్థితిని అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 నుంచి 60 రూపాయలు పైనే పలుకుతోంది. దీంతో వీటి ధరల కట్టడికి కోసం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలో ఉల్లిపాయలను అందుబాటులో ఉంచడం, ధరలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎగుమతులపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. అయితే కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వెల్లడించింది. అయితే, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే, ఎగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.