MP Danish Ali: నా అంతు చూస్తామని బీజేపీ ఎంపీలు బెదిరిస్తున్నారు - బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ
MP Danish Ali: పార్లమెంట్ వేదికగా బహుజన్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ డానిష్ అలీపై భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.
MP Danish Ali: పార్లమెంట్ వేదికగా బహుజన్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ డానిష్ అలీపై భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. అనుచితమైన భాషతో సహచర ఎంపీని దూషిస్తూ, ఆయన మతాన్ని కూడా కించపరిచేలా వ్యాఖ్యానించారు. అలీ లోక్ సభలో ప్రసంగిస్తూ రమేష్ బిధూరిని రెచ్చగొట్టారని, ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై డానిష్ అలీ స్పందించారు. నిషికాంత్ దూబే చెప్పేది నిజమైతే, వీడియో చూపించాలన్నారు. తాను ప్రధానిని దూషించినట్లు కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు. తనను తిడితే బీజేపీ ఎంపీలంతా అక్కడ కూర్చుని నవ్వుకోవడానికి సిగ్గులేదా? అంటూ నిలదీశారు. తాను నిరసన తెలపడంతోనే బీజేపీ ఎంపీలు తనను దుర్భాషలాడారని డానిష్ అలీ చెప్పారు.
సభలో తనపై మాటల దాడి చేశారు. పార్లమెంట్ బయట నా అంతు చూస్తానంటూ నన్ను బెదిరించారు. ఇప్పుడు ఇతర బీజేపీ ఎంపీలు నిరాధారమైనా ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్‌లో మాటలతో బెదిరించడంతో పాటు బయట తననుకు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని డానిష్ అలీ అన్నారు. అంతకుముందు, ప్రధానమంత్రిని అవమానిస్తూ ఓ బీజేపీ ఎంపీ మాట్లాడిన వీడియోను అలీ షేర్ చేశారు. ఈ రోజు కొంత మంది బీజేపీ నాయకులు తాను పార్లమెంటులో రమేష్ బిదూరిని రెచ్చగొట్టినట్లు ప్రచారం చేయడానికి యత్నిస్తున్నారు. అయితే తాను వాస్తవానికి ప్రధాని గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని, మోదీ గురించి ఉపయోగించిన అత్యంత అభ్యంతరకరమైన పదాలను సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలను నిషికాంత్ దూబే ఖండించారు. అలాంటి వ్యాఖ్యలను మర్యాద పూర్వక సమాజం సమర్థించదన్నారు. అలాగే డానిష్ అలీ చర్యలపై విచారణ జరపాలని కూడా ఆయన కోరారు. లోక్‌సభ నిబంధనలను ఉటంకిస్తూ, వారికి కేటాయించిన సమయంలో మరొక ఎంపీని అడ్డుకోవడం, కూర్చున్నప్పుడు మాట్లాడటం నిషేధం అన్నారు. టీఎంసీ, డీఎంకే సభ్యులు సైతం సెషన్‌లో మరో వర్గం విశ్వాసాలపై వ్యాఖ్యలు చేశారని నిషికాంత్ దూబే ఆరోపించారు. సభలో పలువురు ఎంపీలు చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలపై విచారణ కమిటీ వేయాలని స్పీకర్‌ను కోరారు.
రమేష్ బిదూరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. గతంలో బిదూరి చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా, సొంత పార్టీ నేతలు ఖండించారు. అంతేకాకుండా షోకాజ్ నోటీసు అందుకున్నారు. తాజాగా డానిష్ అలీపై వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీతో సహా ప్రతిపక్ష పార్టీలు డానిష్ అలీకి మద్దతుగా నిలిచాయి. బిదూరిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లోక్‌సభలో బీజేపీకి చెందిన రమేష్ బిదూరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ, ఇతర ఎంపీలు చేసిన వ్యాఖ్యలను ఒంటరిగా పరిగణించరాదన్నారు.
చర్చ సందర్భంగా సభలో వివిధ సభ్యులు చేసిన వ్యాఖ్యలను విచారణ చేయడానికి ఒక 'విచారణ కమిటీ'ని ఏర్పాటు చేయాలని, దీని ద్వారా ఇతర పార్లమెంటు సభ్యుల వ్యాఖ్యలపై సైతం విచారణ చేయాలని స్పీకర్‌కు రాసిన లేఖలో నిషికాంత్ దూబే కోరారు. అలాగే ప్రధాని మోదీపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు. అలాగే బరో బీజేపీ ఎంపీ రవి కిషన్ సైతం స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీపై డానిష్ అలీ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కోరారు. డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ ఖండించారు.