PM modi At G20 Summit: జీ20 సదస్సులో అదరగొట్టిన ప్రధాని మోదీ.. 6 కార్యక్రమాల ఫార్ములా ప్రతిపాదన
PM modi | ప్రపంచ పురోగతికి ఆఫ్రికా అభివృద్ధి కీలకం అన్నారు భారత ప్రధాని మోదీ. డ్రగ్స్, ఉగ్రవాదంతో పాటు మరిన్ని అంశాల్లో కలిసి పనిచేయాలని జీ20 సదస్సులో మోదీ ప్రతిపాదించారు.

G20 Summit in Johannesburg | దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జి-20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గ్లోబల్ అభివృద్ధి కోసం 6 కొత్త కార్యక్రమాలను ప్రతిపాదించారు. వీటిలో గ్లోబల్ సాంప్రదాయ జ్ఞాన నిధిని ఏర్పాటు చేయడం, ఆఫ్రికా నైపుణ్యానికి చొరవ, గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్, డ్రగ్స్, ఉగ్రవాదం లాంటి సమస్యలను ఎదుర్కోవటానికి చొరవ, ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం, కీలక ఖనిజాల సర్క్యులేషన్ చొరవ లాంటి అంశాలను మోదీ సూచించారు.
గ్లోబల్ సాంప్రదాయ జ్ఞాన నిధి
అభివృద్ధిపై జరిగిన జీ20 మొదటి సమావేశంలో ఈ కార్యక్రమాలు సమగ్ర అభివృద్ధిని సాధించడంలో సహాయపడతాయని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ నాగరిక విలువలు ముందుకు సాగడానికి మార్గం సుగమం చేస్తాయని అన్నారు. జి-20 గ్లోబల్ సాంప్రదాయ జ్ఞాన నిధి, సాంప్రదాయ జ్ఞానాన్ని డాక్యుమెంట్ చేస్తుందని, ఇది స్థిరమైన జీవన నమూనాలను ప్రదర్శిస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు కూడా అందేలా చూస్తుందని ఆయన అన్నారు.
దక్షిణాఫ్రికాలో 3 రోజుల పర్యటనలో ప్రధాని మోదీ
సాంప్రదాయ జ్ఞాన నిధి విషయంలో భారతదేశ చరిత్ర గొప్పదని శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. ఇది మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మన సామూహిక జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. దక్షిణాఫ్రికాలో 3 రోజుల పర్యటనలో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆఫ్రికా అభివృద్ధి ప్రపంచ పురోగతికి చాలా కీలకం అన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ఈ ఖండంతో సంఘీభావంగా నిలబడుతుంది అన్నారు.
గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో బలంగా పనిచేసే జి-20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. "ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మనం కలిసి పనిచేసినప్పుడు, మనం మరింత బలపడతాము. ఏదైనా ప్రపంచ ఆరోగ్య సంక్షోభం లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు తక్షణమే మోహరించడానికి సిద్ధంగా ఉన్న శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను జి-20 మిత్ర దేశాల నుండి సిద్ధం చేయడానికి మనం ప్రయత్నించాలి" అని మోదీ అన్నారు.
డ్రగ్-ఉగ్రవాద కలయికను ఎదుర్కోవడం
అంతేకాకుండా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా సవాలును ఎదుర్కోవటానికి, ఫెంటానిల్ వంటి మాదకద్రవ్యాలను నిరోధించడానికి డ్రగ్-ఉగ్రవాద కలయికను ఎదుర్కోవటానికి జి-20 చొరవ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ చొరవ కింద, మనం ఆర్థిక, పాలన, భద్రతకు సంబంధించిన అనేక చర్యలను ఒకేసారి తీసుకోవచ్చని ప్రధాని మోదీ సూచించారు. అప్పుడే డ్రగ్స్, ఉగ్రవాదం లాంటి కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను బలహీనపరచవచ్చు.
ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం
ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం గురించి మోదీ ప్రస్తావిస్తూ, జి-20 అంతరిక్ష సంస్థల శాటిలైట్ డేటాను అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యవసాయం, మత్స్య పరిశ్రమతో పాటు విపత్తు నిర్వహణ వంటి కార్యకలాపాల కోసం అందుబాటులో ఉంచవచ్చని భారత ప్రధాని అన్నారు. పట్టణ మైనింగ్, సెకండ్-లైఫ్ బ్యాటరీ ప్రాజెక్ట్‌లు, ఇతర ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కీలక ఖనిజాల సర్క్యులర్ చొరవను కూడా ప్రధాని మోదీ ప్రతిపాదించారు.






















