అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం
అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని స్టాలిన్ ప్రకటించారు. అవయవ దానం చేయడంతో తమిళనాడు దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు.
అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దలు అంటారు. ప్రస్తుత సమాజంలో అన్ని దానాల్లో కెల్లా అవయవదానం గొప్పదని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి అవయవాలను, వైద్యుల సూచనతో కుటుంబసభ్యులు దానం చేస్తుంటారు. అవయవాల దానం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అవయవాలు దానం చేసే వారికి గుర్తింపు లభించే విధంగా...ఆర్గాన్స్ దానం చేసే వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎందరికో ఆదర్శప్రాయమని, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆచరించాలని సూచిస్తున్నారు.
అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని స్టాలిన్ ప్రకటించారు. అవయవ దానం చేయడంతో తమిళనాడు దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. వందల మందికి అవయదానం చేయడం వల్ల కొత్త జీవితం ఇచ్చినట్లు అవుతుందన్నారు. నిస్వార్ధంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారి వల్లే తమిళనాడుకు ఈ ఘనత దక్కిందన్నారు స్టాలిన్. బ్రెయిన్ డెడ్‌కు గురైన కుటుంబసభ్యుల విషాదకర పరిస్థితుల్లో, అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చే కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. తమ ఆత్మీయులు చనిపోయిన విషాదకర పరిస్థితుల్లోనూ, అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. అవయవదానం చేసిన వారి త్యాగాన్ని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
తమిళనాడు ఉత్తమ అవయవ, కణజాల మార్పిడి సంస్థగా అవార్డును కైవసం చేసుకుంది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్, ఈ అవార్డును అందజేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చేతుల మీదుగా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలో 13 ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కేంద్రాలు ఉన్నాయి. 6,179 మంది కిడ్నీల కోసం, 4049 మంది కాలేయం కోసం వేచి చూస్తున్నారు. 72 మంది హార్ట్ పేషెంట్లు, 60 మంది ఉపిరితిత్తుల కోసం ఎదురుచూస్తున్నారు.
2022 సంవత్సరానికి గాను దేశంలో అత్యధిక అవయవదానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం 2022లో తెలంగాణలో 194 అవయవ దానాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో 154 అవయవ దానాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర వరుస స్థానాల్లో నిలిచాయి.