Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్‌పై కీలక అప్‌డేట్ - తొలి రైలు వచ్చేది ఆ రోజేనా!
Vande Bharat Trains: దేశంలో త్వరలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
First Vande Bharat Train May Strated By August 15th: దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరో 2 నెలల్లో అంటే ఆగస్ట్ 15 నాటికి తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కేవలం వందేభారత్ ఛైర్ కార్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ అందుబాటులోకి వస్తే ప్రయాణిికులకు మరింత సౌకర్యం కలగనుంది.
మొత్తం ఎన్ని బోగీలంటే.?
వందేభారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయని అదికారులు వెల్లడించారు. వీటిలో 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించినట్లు చెప్పారు. ఈ స్లీపర్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తొలుత గంటకు 130 కి.మీల వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని కొద్ది రోజుల తర్వాత క్రమంగా గంటకు 160 - 220 కి.మీల వేగానికి పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఆ రూట్‌లోనే..
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవలే స్లీపర్ రైలు పనుల పర్యవేక్షణకు బెంగుళూరు వెళ్లారు. వందేభారత్ రైలు స్లీపర్ రైలు తయారీ చివరి దశలో ఉందని చెప్పారు. దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును.. రద్దీగా ఉండే ఢిల్లీ - ముంబయి మార్గంలో అందుబాటులోకి తెస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్లీపర్ రైలు ఢిల్లీ నుంచి భోపాల్, సూరత్ మీదుగా ముంబయి చేరుకుంటుందని అధికారులు తెలిపాయి. ఈ రూట్‌లోనే తొలి రైలు అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.