(Source: ECI/ABP News/ABP Majha)
Loksabha Speaker Elections: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ - అభ్యర్థిని నిలిపిన I.N.D.I.A కూటమి, చరిత్రలోనే తొలిసారిగా!
Loksabha Speaker: 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగనుంది.
Loksabha Speaker Election: 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ క్రమంలో స్పీకర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విపక్ష I.N.D.I.A కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి ఆశించగా.. అది దక్కకపోవడంతో స్పీకర్ పదవి కోసం పోటీ పడుతోంది. అయితే, ఎప్పటిలాగే లోక్‌సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వం యత్నించగా.. I.N.D.I.A కూటమి సైతం బరిలోకి దిగడంతో అది సాధ్యపడలేదు. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టినా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో సభాపతి స్థానం కోసం I.N.D.I.A కూటమి బరిలో నిలిచింది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా..
ఈ క్రమంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. సభాపతి పదవి కోసం ఎన్డీయే తరఫున ఓంబిర్లా (Om Birla), I.N.D.I.A కూటమి తరఫున కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ (Suresh) బరిలో నిలిచారు. ఈ ఇద్దరు నేతలు స్పీకర్ పదవి కోసం మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఎందుకిలా.?
అయితే, వాస్తవానికి లోక్‌సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సిందేనని.. లేకుంటే సభాపతి స్థానం కోసం తాము అభ్యర్థిని నిలబెడతామని చెప్పాయి. ఈ క్రమంలో బీజేపీ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను రంగంలోకి దించింది. ఆయన మంగళవారం ఉదయం నుంచీ I.N.D.I.A కూటమి నేతలు మల్లికార్జునఖర్గే, ఎంకే స్టాలిన్, ఇతర నేతలతోనూ వరుస చర్చలు జరిపారు.
స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని.. అందుకు సహకరించాలని కోరారు. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు సైతం లోక్ సభ స్పీకర్ పదవి కోసం బరిలో నిలిచాయి. మంగళవారంతో స్పీకర్ పదవి కోసం నామినేషన్ ముగుస్తుండగా.. ఎన్డీయే తరఫున ఓం బిర్లా, I.N.D.I.A కూటమి తరఫున కేరళ ఎంపీ కె.సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 26న (బుధవారం) ఎన్నిక నిర్వహించనున్నారు.
NDA leaders signed a motion paper in favour of Om Birla for the Speaker of the 18th Lok Sabha. pic.twitter.com/U3X3PlYvBp
— ANI (@ANI) June 25, 2024
Congress MP K Suresh filed his nomination for the post of Speaker of the 18th Lok Sabha
— ANI (@ANI) June 25, 2024
NDA has fielded BJP MP Om Birla for the post of Speaker
(Picture shared by a Congress MP) pic.twitter.com/q5ZbvRVrgR
1946 తర్వాత..
1925 - 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చివరిసారిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్ నేత జి.వి.మౌలాంకర్.. అనంతరం పార్లమెంటుకు కూడా స్పీకర్‌గా కొన్నాళ్లు కొనసాగారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మౌలంకర్ మరణంతో డిప్యూటీ స్పీకర్ అయ్యంగార్.. స్పీకర్ అయ్యారు. అనంతరం 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి స్పీకర్ ఎన్నిక అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. కానీ ఈసారి, ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.
Also Read: Delhi minister : విషమించిన ఢిల్లీ మంత్రి అతిషి ఆరోగ్య పరిస్థితి.. ఆసుపత్రికి తరలింపు