Maharashtra And Jharkhand Assembly Elections 2024: నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల నగారా - మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల
Elections Commission of India : మహారాష్ట్ర, జార్ఖండ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ మధ్యాహ్నం విడుదల కానుంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే అయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.
Maharashtra and Jharkhand Assembly Election Dates: మహారాష్ట్ర, జార్ఖండ్‌ల శాసనసభలకు ఎన్నికల నగారా మోగనుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించనుంది. ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు పోల్ ప్యానెల్ మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది.
నవంబర్ 26తో ముగియనున్న మహారాష్ట్ర ప్రభుత్వ పదవీకాలం
ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికలను ప్రకటించిన తర్వాత మహారాష్ట్ర , జార్ఖండ్‌లో ప్రవర్తనా నియమావళి ఉంటుంది. మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది. ఇప్పటికే మహారాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నికల మోడ్‌లోనే పని చేస్తోంది. సోమవారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గ కీలక నిర్ణయాలు తీసుకుంది. హోంగార్డుల వేతనాన్ని రెట్టింపు చేసింది. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచింది. ఐదు టోల్ గేట్ల వద్ద టోల్‌ను రద్దు చేసింది. దీంతో పాటు గవర్నర్ నియమించిన 7 మంది ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇది జరిగిన కాసేపటికే ఎన్నికల షెడ్యూల్ రానుంది.
దేశం దృష్టంతా మహారాష్ట్ర ఎన్నికలపైనే
రెండు ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ విడిపోయిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మహారాష్ట్రపై అందరి దృష్టి ఉంది. మహావికాస్ అఘాడి, మహాయుతి సీట్ల పంపకంపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరిగాయి. రాజకీయంగా హాట్‌హాట్‌గా ఉన్న వేళ ఈసారి ఎన్ని దశల్లో పోలింగ్ జరుగుతుందనే ఆసక్తి ఉంది.
Also Read: కెనడా ఇక ఖలిస్థాన్ సపోర్టర్లకు మాత్రమేనా ? ఇతర భారతీయులు వెనక్కి రావాల్సిందేనా ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మహా వికాస్ అఘాడి, మహాయుతి మధ్య ఉంది. మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్, శివసేన యూబీటీ ఉన్నాయి. మహాయుతికి బీజేపీ, శివసేనకు చెందిన షిండే గ్రూపు, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ గ్రూపు ఉంది. సీట్ల పంపకంపై రెండు కూటములు బిజీబిజీగా ఉన్నాయి.
జార్ఖండ్‌లో బీజేపీ, ఇండీ కూటమి మధ్య పోటీ నెలకొంది
జార్ఖండ్‌లో పోటీ ఆ రెండు కూటముల మధ్యే
జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 5 జనవరి 2025తో ముగియనుంది. అన్ని పార్టీలు 81 అసెంబ్లీ స్థానాలపై ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక్కడ ఇండీ కూటమి, ఎన్డీయే మధ్య గట్టి పోటీ నెలకొంది. 2019లో మహాకూటమి విజయంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.
జేఎంఎం కూటమి అంటూ హేమంత్ కామెంట్స్
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న వేళ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేఎంఎం సెంట్రల్ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి 81 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామన్నారు. అందుకే కచ్చితంగా ఈసారి తమ కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.