Warning For Forces: యూనిఫాంలో ఫోటోలు దిగొద్దు, రీల్స్ చేయొద్దు - భద్రతా బలగాలకు హెచ్చరిక
Warning For Forces: యూనిఫాంలో ఫోటోలు దిగడం, రీల్స్ చేయడంపై భద్రతా బలగాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Warning For Forces: హనీ ట్రాప్ ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర బలగాల్లో పని చేసి వారికి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి సోషల్ మీడియా వేదికగా వలపు వల విసురుతూ.. అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చాలా మంది ఈ హనీ ట్రాప్ లో చిక్కుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పోలీసు బలగాలు తమ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశాయి. సోషల్ మీడియా వేదికల వాడకంపై కీలక సూచనలు చేశాయి. ఆన్ లైన్ లో స్నేహాల జోలికి వెళ్లవద్దని ఆదేశించాయి. సోషల్ మీడియాల్లో రీల్స్, షార్ట్స్ వంటివి చేయవద్దని హెచ్చరించాయి. అలాగే యూనిఫాం ధరించి ఫోటోలు దిగవద్దని, వాటిని సోషల్ మీడియాల్లో అప్ లోడ్ చేయవద్దని చెప్పాయి. వీటి వల్ల హనీ ట్రాప్ ముప్పు పెరుగుతుందని, వాటి వల్ల దేశ భద్రతకు, శాస్త్ర, సాంకేతికతకు సంబంధించి కీలకమైన, సున్నితమైన సమాచారం శత్రువులకు చేరుతుందని హెచ్చరికలు జారీ చేశాయి.
ఇటీవల హనీ ట్రాప్ ఘటనలు పెరిగిపోతుండటంతో.. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు పరిశీలన చేపట్టాయి. ఇందులో.. కొందరు సిబ్బంది యూనిఫాం ధరించి ఫోటోలు దిగుతున్నట్లు, వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నట్లు గుర్తించాయి. దాంతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు వెల్లడైంది. అలాగే కొందరు సిబ్బంది ఆన్ లైన్ లో స్నేహితుల కోసం రిక్వెస్ట్ లు పంపుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ మేరకు కేంద్ర పారామిలిటరీ, పోలీసు బలగాలకు లేఖలు రాశాయి.
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. పోలీసు బలగాలు అప్రమత్తం అయ్యాయి. తమ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. యూనిఫాంతో ఉన్న వీడియోలను, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని, గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ లో ఫ్రెండ్షిప్ చేయవద్దని సిబ్బందిని హెచ్చరించాయి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశాయి. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు అందాయి. దిల్లీ పోలీసుల కమిషనర్ సంజయ్ అరోఢా కూడా తమ బలగాలకు ఈ తరహా హెచ్చరికలే జారీ చేశారు. విధుల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియానను వాడొద్దన్నారు. సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని హెచ్చరించారు. యూనిఫాంతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేయవద్దని చెప్పారు. విధుల్లో ఉన్నప్పుడు వీడియోలు తీసి వాటిని అప్ లోడ్ చేయవద్దని హెచ్చరించారు. హై-సెక్యూరిటీ ప్రాంతాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించవద్దని, ప్రముఖుల వీడియోలు తీయవద్దని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Paris Olympics: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా, పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత
భద్రతా బలగాల్లో పని చేస్తున్న వారిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వారితో మాటలు కలుపుతారు. తమ మాయామాటలతో మత్తెక్కిస్తారు. ప్రైవేట్ ఫోటోలు పంపడం, వీడియో కాల్స్ చేయడం లాంటివి చేస్తారు. వలపులతో వల విసురుతారు. ఆ వలకు చిక్కుకున్న వారి నుంచి మెల్లిగా సున్నితమైన సమాచారాన్ని లాగుతారు. ఈ హనీ ట్రాప్ లో చిక్కుకుని దేశ భద్రతకు చెందిన కీలకమైన సమాచారాన్ని శత్రువులకు అందిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.