Kerala : కేరళలో అద్భుతం - చెట్టు కొమ్మ కారణంగా కన్ను పోయిన వ్యక్తికి చూపునిచ్చిన డాక్టర్లు
Kerala Doctors : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి చెట్టు కొమ్మ కన్ను లోపలికి గుచ్చుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన 24 ఏళ్ల వ్యక్తి త్రివేండ్రంలోని కిమ్స్ హెల్త్‌లో శస్త్రచికిత్స తర్వాత తన చూపు పొందాడు.

Kerala Doctors : కేరళను ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా అని కూడా అంటారు. ఆ రాష్ట్రం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కేరళలో అందమైన సముద్ర తీరం.. అబ్బురపరిచే పచ్చని పర్వతాలు, స్వచ్ఛమైన సరస్సులు, కనువిందు చేసే కాలువలు.. ఇలా ఎన్నో కనులవిందుగా ఉండే అద్భుతాలు ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడి బ్యాక్ వాటర్‌లో పడవలపై ప్రయాణం అనుభూతిని జీవితంలో మర్చిపోలేరు. ప్రపంచంలో జీవవైవిధ్యం కలిగిన 25 ప్రాంతాల్లో కేరళ ఒకటి. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ సర్వే ప్రకారం.. ప్రపంచంలో చూడదగిన మొదటి 50 ప్రదేశాల్లో కూడా కేరళ ప్రత్యేక స్థానం సాధించింది. అలాంటి కేరళ రాష్ట్రానికి చెందిన డాక్టర్లు అద్భుతాన్ని సృష్టించారు. ఇక అసలు రాదనుకున్న వ్యక్తికి కంటి చూపును ప్రసాదించారు.
వివరాల్లోకి వెళ్తే.. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి చెట్టు కొమ్మ కన్ను లోపలికి గుచ్చుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన 24 ఏళ్ల వ్యక్తి త్రివేండ్రంలోని కిమ్స్ హెల్త్‌లో కీలకమైన శస్త్రచికిత్స తర్వాత తన దృష్టిని తిరిగి పొందాడు. కొల్లంకు చెందిన ఆ యువకుడి ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టడంతో చెట్టు కొమ్మ అతని ఎడమ కంటిలోకి గుచ్చుకుంది. దాని ఫలితంగా అతను రోడ్డుపై పడిపోయాడు. 15 సెం.మీ పొడవున్న కొమ్మలో సగం అతని కంటి కిందకి చొచ్చుకుపోయి ముక్కులోకి ప్రవేశించింది. ప్రమాదంలో అతని హెల్మెట్ ఊడిపోవడంతో తన పుర్రెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
గంటన్నరకు పైగా జరిగిన ఈ క్లిష్టమైన ఆపరేషన్లో డాక్టర్ల బృందం ఆ వ్యక్తికి నష్టం జరగకుండా కొమ్మను తొలగించింది. ముక్కుపై ఉన్న గాయాన్ని ఎండోస్కోపిక్ విధానం ద్వారా సరిచేశారు. ముక్కుకు ప్యాకింగ్ చేయడం ద్వారా రక్తస్రావాన్ని కంట్రోల్ చేశారు. న్యూరో సర్జరీ, ఈఎంటీ, ఆప్తాల్మాలజీ, ఓరల్ & మాక్సిల్లోఫేషియల్ సర్జరీ విభాగాలకు చెందిన నిపుణుల సమిష్టి కృషి కారణంగా రోగి కోలుకున్నాడు. ఇటువంటి సందర్భాల్లో దృష్టి కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుపాప చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ చుట్టుపక్కల రక్త నాళాలు, నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోగి దృష్టిని పునరుద్ధరించడానికి, అతని ప్రాణాలను కాపాడటానికి సకాలంలో శస్త్ర చికిత్స జరిగిందని డాక్టర్ అన్నారు. చికిత్సకు నాయకత్వం వహించిన న్యూరోసర్జరీ విభాగం కన్సల్టెంట్ అరుణ్ ఇప్పుడు యువకుడికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న యువకుడు డిశ్చార్జ్ అయ్యాడు.. ప్రస్తుతం తను పూర్తిగా కోలుకున్నారు. ఈఎంటీ డాక్టర్ సలీల్ కుమార్, ఓరల్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ డాక్టర్ సూరజ్ కుమార్,ఆప్తాల్మాలజీ విభాగం డాక్టర్ డైసీ కరణ్, అనస్థీషియా విభాగానికి చెందిన కన్సల్టెంట్లు డాక్టర్ గోపన్ జి, డాక్టర్ అరుణ్ ఎన్ఎస్ కూడా ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు.





















