Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు నిజంగా అమలు చేస్తారా? ప్రశ్నలు లేవనెత్తిన ఉదయనిధి స్టాలిన్
Women Reservation Bill: కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నలు లేవనెత్తారు.

Women Reservation Bill: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నలు లేవనెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తదుపరి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ తర్వాత మాత్రమే అమలు చేయడం గురించి మాట్లాడుతుందని, దీని వెనక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన తర్వాత దాని అమలుపై స్టాలిన్ సందేహాలు లేవనెత్తారు. ఈ ప్రతిష్టాత్మక బిల్లు అమలుపై ఎలాంటి స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.
'వారు(కేంద్రంలోని బీజేపీ సర్కారు) ప్రస్తుతానికి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయబోవడం లేదని తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా మేము అలాంటి చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ కసరత్తు మాత్రమే చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇప్పుడు దానిని ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
ఓ మైలేజీ చర్య మాత్రమే!
రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా ప్రతిపాదిత చట్టం అమలుపై ప్రశ్న లేవనెత్తారు. ఇది బీజేపీకి రాజకీయ మైలేజీని ఇచ్చే మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక చట్టాన్ని మేమే అమలులోకి తెచ్చామని ప్రజలకు, ముఖ్యమంగా మహిళలను చెప్పాలనుకుంటున్నారని కపిల్ సిబల్ అన్నారు. 2014 లోనే ఈ చట్టాన్ని తీసుకు వచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసే లోపు జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరగాలని, జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరగకపోతే ఏం చేయాలని కపిల్ సిబల్ ప్రశ్నించారు.
కపిల్ సిబల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. కాంగ్రెస్ 2010లో అధికారంలో ఉన్నప్పుడు మహిళా నేతలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరలేదని, ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుకోవడం లేదని ఆరోపించారు.
మాటల యుద్ధం..
మహిళా రిజర్వేషన్ బిల్‌పై పార్లమెంట్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మహిళా ఎంపీల ప్రసంగాలతో సభలు దద్దరిల్లిపోయాయి. ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ చర్చ మొదలు పెట్టారు. ఆ తరవాత వరసగా డీఎమ్‌కే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడారు. మోదీ ప్రభుత్వంవై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రెజ్లర్లు అన్ని నెలల పాటు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇదంతా కేవలం ఎన్నికల గిమ్మిక్కు అంటూ మండి పడ్డారు. దీనికి దీటుగానే బదులిచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. మోదీ ప్రభుత్వం మహిళలను లెక్కలోకి తీసుకుందని, గత ప్రభుత్వాలు మాత్రం మహిళల్ని లెక్క చేయలేదని తేల్చి చెప్పారు. ఈ బిల్‌కి సంపూర్ణ మద్దతునిస్తామని వెల్లడించిన సోనియా గాంధీ...ఓబీసీ వర్గానికి చెందిన మహిళలకు సబ్‌కోటా ఇవ్వాలని కోరారు.
వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారని అన్నారు సోనియా. దేశ స్వాతంత్య్రోద్యమం నుంచి మహిళల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. 2010లోనే తాము రాజ్యసభలో ఈ బిల్ ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. అప్పట్లో కొందరు ఈ బిల్‌ని అడ్డుకున్నారని, అందుకే అమల్లోకి తీసుకురాలేకపోయామని స్పష్టం చేశారు. అప్పట్లో రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయినప్పటికీ లోక్‌సభలో పాస్ కాలేదు. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ అడ్డుకోవడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే...2029 వరకూ మహిళలకు ఈ బిల్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని తేల్చి చెప్పారు సోనియా గాంధీ. ఇది అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళలు ఎన్నాళ్లు వేచి చూడాలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

