కన్నడ భాష పేరుతో విధ్వంసానికి పాల్పడితే సహించేది లేదు - డీకే శివకుమార్
DK Shivakumar: కన్నడ భాష పరరిక్షణ పేరుతో విధ్వంసానికి పాల్పడితే సహించేది లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు.
DK Shivakumar News: కన్నడ (Kannada) భాష పరరిక్షణ పేరుతో విధ్వంసానికి పాల్పడితే సహించేది లేదని కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి ( Dy CM) డీకే శివకుమార్ (Shivakumar) హెచ్చరించారు. కన్నడ భాష కోసం పోరాడుతున్న వారికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భాషా పరిరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కన్నడ భాషను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కన్నడ పరిరక్షణ కోసం నిరసనలు వ్యక్తం చేయవచ్చని, అయితే ఇతరులకు ఆస్తులకు నష్టం కలిగించేలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలంతా వచ్చి...రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని స్పష్టం చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడ నివసిస్తున్నారని, వారందర్నిఆందోళన పరిచేలా వ్యవహరించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం మంచి పరిణామం కాదని డీకే శివకుమార్ తెలిపారు. 60 శాతం కన్నడ అమలు విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని, ఇందులో ఎవరు తమను శంకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ కన్నడ భాషలోనే ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించినవారికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకుంటామన్నారు.
29 మంది ఆందోళనకారులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్
కర్ణాటక రక్షణ వేదికె ఆధ్వర్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. వాణిజ్య, వ్యాపార సంస్థల నేమ్ ప్లేట్లపై కనీసం 60 శాతం కన్నడ ఉండేలా చూడాలంటూ తీసిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆందోళనకారులు పలు ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్తులపై విధ్వంసానికి పాల్పడ్డారు. భాష పరిరక్షణ కోసం టీఏ నారాయణ గౌడ ఆధ్వర్యంలో...కన్నడ భాషాభిమానులు యలహంక భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంగ్లీష్ పేర్లు ఉన్న ఫ్లెక్సీలు, బోర్డులను ఆందోళనకారులు ధ్యంసం చేశారు. పలుప్రాంతాల్లో రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని చోట్ల ఇంగ్లీష్ లో బోర్డులను పగలగొట్టారు. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. దాదాపు 500 మందిని కన్నడ భాషాభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యలహంకలో అరెస్టయిన నారాయణగౌడ తదితరులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారందరికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
కన్నడ భాషలో రాయడం వల్ల సమస్యేంటన్న కేంద్ర మంత్రి జోషి
కన్నడ భాష పరిరక్షణ ఉద్యమంపై కేంద్ర మంత్రి, కర్ణాటకు చెందిన బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోసి స్పందించారు. కర్ణాటకలోని దుకాణాల బోర్డులన్నీ కన్నడ భాషలోనే ఉండాలనే డిమాండ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ దుకాణాల పేర్లు చదవాలంటే స్థానిక భాషలోనే ఉండాలని, ఇంగ్లీష్ లో ఉంటే అందరూ చదవలేరని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ లేదా హిందీ భాషలలో రాయడం వల్ల వచ్చే నష్టం ఏమిటి ? అని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రం ఏమీ ఇంగ్లాండ్ లో లేదని, దుకాణదారులు కూడా అవసరాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.