Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాట ఘటన, సత్సంగ్ ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Hathras Stampede Latest Telugu News | హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాటలో 121 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Main organiser of Hathras satsang stampede arrested | హత్రాస్: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇదివరకే ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సత్సంగ్ నిర్వహించిన ప్రధాన నిర్వహకుడు, ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మధుకర్ పోలీసులకు లొంగిపోయాడని, అనంతరం పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారని లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు.
తొక్కిసలాటతో ఊహించని విషాదం
హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్. భోలే బాబా హత్రాస్ జిల్లాలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తరువాత భోలే బాబా వెళ్లిపోతుంటే ఆయన్ను దగ్గరి నుంచి చూడాలని కొందరు, ఆయన పాదదూళి సేకరిద్దామని కొందరు భక్తులు తోపులాట చేయడంతో అది అనంతరం తొక్కిసలాటకు దారి తీసింది. నిమిషాల వ్యవధిలో అక్కడ వందకు పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మొదట 27 మంది చనిపోయినట్లు ప్రకటించారు, ఆపై మరణాల సంఖ్య 87 అని చివరగా ఈ విషాదంలో 121 మంది చనిపోయారని అలీగఢ్ పోలీసులు వెల్లడించారు.
తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు మొదట ఆరుగురు సత్సంగ్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ శలభ్ మధుర్ వెల్లడించారు. వీరు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులని చెప్పిన ఆయన ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.1 లక్ష నజరానా సైతం ప్రకటించారు. సత్సంగ్ ప్రధాన నిర్వాహకుడైన మధుకర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పోలీసులు సత్సంగ్ ప్రధాన నిర్వాహకుడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే..
హత్రాస్ ఘటనపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 80 వేల మందికి అనుమతి ఉన్న సత్సంగ్ కార్యక్రమానికి దాదాపు 2.50 లక్షల మంది హాజరయ్యారు. అనుకోకుండా తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణ నష్టం జరగడంతో సత్సంగ్ నిర్వాహకులు భక్తుల సంఖ్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ఉన్న భక్తుల చెప్పులు, ఇతర సాక్ష్యాలను మాయం చేసేందుకు చూశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. తమ రోగాలను నయం చేసి పరిష్కారం చూస్తాడని వచ్చిన ఎంతో మంది భక్తులు తొక్కిసలాట జరగడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతులలో అధికంగా చిన్నారులు, మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఏమైనా రాజకీయ, కుట్ర కోణం దాగి ఉందా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రాజస్థాన్‌లో తలదాచుకున్న భోలే బాబా
భోలే బాబాకు మరోపేరు నారాయణ సర్కార్ విశ్వహరి. కాగా, తొక్కిసలాట విషాదం తరువాత భోలే బాబా పరారీలో ఉన్నాడు. రాజస్థాన్ లో ఓ పేపర్ లీక్ కేసు ప్రధాని నిందితుడి వద్ద తల దాచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. రాజస్థాన్ లో 2020లో జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు హర్షవర్ధన్ మీనా. అతడి వద్దకు భోలే బాబా తరచుగా వెళ్తాడని పోలీసులు తెలిపారు. త్వరలోనే భోలే బాబాను సైతం అరెస్ట్ చేసి విచారణ చేపడతామన్నారు.