Cyclone Biparjoy: స్పీడ్ పెంచిన బిపార్‌జాయ్, చెవులకు చిల్లులు పడేలా ఈదురు గాలులు - వణికిపోతున్న ప్రజలు
Cyclone Biparjoy: తుపాన్ కారణంగా వీస్తున్న ఈదురు గాలులు ప్రజల్ని భయపెడుతున్నాయి.
Cyclone Biparjoy:
అంతా నిర్మానుష్యం..
బిపార్‌జాయ్ తుపాను వేగం పెరిగింది. కొన్ని గంటల్లోనే గుజరాత్ తీర ప్రాంతాన్ని గట్టిగా తాకనుంది. తుపాను ఇంకా తీరాన్ని తాకముందే విధ్వంసం మొదలైంది. పలు చోట్ల ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. బలమైన గాలులకు కూలిపోతున్నాయి. కచ్, సౌరాష్ట్ర, మాండ్వితో పాటు గుజరాత్‌లోని దాదాపు 8 జిల్లాల్లో ప్రభావం కనిపించనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో IMD రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తుపాను ఎక్కడైతే మొదటగా ఢీ కొట్టనుందో ఆ ప్రాంతం నుంచి ABP News రిపోర్ట్ చేసింది. మాండ్విలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ శబ్దాలు అక్కడి ప్రజల్ని భయపెడుతున్నాయి. అత్యంత భయంకరంగా వీస్తున్న ఆ గాలుల తాకిడిని తట్టుకోవడం కష్టమే అంటున్నారు అధికారులు. బయటే కాదు. ఇంట్లో కూర్చున్నా కూడా గాలి వీస్తున్న శబ్దాలు చెవుల్లో మారుమోగుతున్నాయంటే...అక్కడ ఏ స్థాయిలో తుపాను ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు ఇక్కడి ప్రజలు. రహదారులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. షాప్స్ అన్నీ మూసేశారు. టూరిస్ట్‌లను ఎక్కడికక్కడే ఆపేశారు అధికారులు. టూరిస్ట్ ప్లేసెస్‌నీ మూసేశారు. పర్యాటకులంతా హోటళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.
బిపార్‌జాయ్ తుపాను అప్పుడే విధ్వంసం మొదలు పెట్టింది. గుజరాత్ తీర ప్రాంతాలకు చేరుకుంటున్న సమయంలో ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. జామ్‌నగర్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయినట్టు NDRF వెల్లడించింది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్స్‌తో పాటు ప్రత్యేకంగా 18 బృందాలను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
"తుపాను తాకిడికి కొండ చరియలు విరిగి పడ్డాయి. జామ్‌నగర్‌లో ఇప్పటికే కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నార్త్,సౌత్ ఏరియాల్లో టీమ్స్ రెడీగా ఉన్నాయి. రాజ్‌కోట్‌లో 2 టీమ్స్, జామ్‌నగర్‌లో ఓ టీమ్ సిద్ధంగా ఉంది. వీటితో పాటు 4-5 రిజర్వ్ టీమ్స్‌ని ఏర్పాటు చేశాం. ఇళ్లు ధ్వంసం కాకుండా చూడడమే మా ముందున్న అతి పెద్ద సవాలు. అలలు 3-6 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే ప్రమాదముంది. వీలైనంత త్వరగా పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం"