Conversion Racket: గేమింగ్ యాప్స్‌తో మత మార్పిడి, చిన్నారులే టార్గెట్ - దేశవ్యాప్తంగా భారీ నెట్‌వర్క్
Conversion Racket: గేమింగ్ యాప్స్‌తో పిల్లల బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చుతుండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
Gaming Apps Conversion Racket:
పిల్లల బ్రెయిన్ వాష్..
మత మార్పిడిపై దేశవ్యాప్తంగా డిబేట్ జరుగుతూనే ఉంది. "బలవంతంగా మత మార్పిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం" అని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వార్నింగ్ కూడా ఇచ్చాయి. దీనిపై నిఘా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని డిజిటలైజ్ చేశాయి కొన్ని ముఠాలు. ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో ఆకట్టుకుని...మెల్లగా పిల్లలకు బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడి చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. గేమింగ్ యాప్స్ ద్వారా ప్రభావితం చేస్తున్నారు. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ బాలుడు ఇలానే ప్రయత్నించాడు. అదిగో అక్కడ తీగ లాగితే డొంకంతా బయటపడింది. 400 మంది పిల్లల్ని మతం మార్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అటు కేంద్ర దర్యాప్తు సంస్థ NIA కూడా రంగంలోకి దిగి విచారిస్తోంది. ఈ నెట్‌వర్క్ దేశమంతా విస్తరించిందని గుర్తించారు. కేంద్ర హోం శాఖ కూడా దీనిపై అప్రమత్తమైంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలని యూపీ పోలీసులను ఆదేశించింది. Fortnite,Discord అనే గేమింగ్ యాప్స్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ రెండు యాప్స్‌పై సమగ్రంగా విచారణ చేపట్టాలని బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ నెట్‌వర్క్‌ని హ్యాండిల్ చేస్తున్న కీలక వ్యక్తి పరారీలో ఉన్నాడు. కొవిడ్ సమయంలో Fortnite అనే గేమింగ్ యాప్ వెలుగులోకి వచ్చింది. చాలా మంది చిన్నారులు ఈ గేమ్‌కి అలవాటుపడ్డారు. తల్లిదండ్రులు కూడా "గేమ్స్ ఆడుకుంటున్నాడులే" అని లైట్ తీసుకున్నారు. కానీ...అసలు విషయం బయటపడ్డాక షాక్ అయ్యారు. Discord అనే మరో చాటింగ్ యాప్‌లోనూ పిల్లలను టార్గెట్ చేసుకుని వాళ్లతో మాట్లాడుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
హోం శాఖ అలెర్ట్..
హోం శాఖ ఈ రాకెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. షాహ్‌నవాజ్ అనే వ్యక్తి ఈ నెట్‌వర్క్ వెనకాల ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. రకరకాల సిటీల్లోని వందలాది చిన్నారులను లక్ష్యంగా చేసుకుని మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. Baddo పేరుతో ఐడీ క్రియేట్ చేసుకున్న నిందితుడు పిల్లలని మచ్చిక చేసుకుని మాట్లాడినట్టు తెలిపారు. కొన్ని వివాదాస్పద వీడియోలను పంపించి...వాటిని వినాలని చెప్పాడు. అలా మెల్లగా బ్రెయిన్ వాష్ చేశాడు. దగ్గర్లోని మసీదుల్లోకి వెళ్లి నమాజ్ చేయాలని సూచించాడు. ఈ మాటలకు ప్రభావితమై ఇప్పటికే కొందరు మతం మారినట్టు సమాచారం. "మా నాన్న మతం మారాడు. ఇప్పుడు నాకూ మారాలని ఉంది" అని ఓ బాలిక చెప్పడం పోలీసులను షాక్‌కి గురి చేసింది. NIA ఈ ముఠాని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి పోలీసులు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఈ మత మార్పిడిపై The Kerala Story అనే సినిమా విడుదలైంది. హిందూ అమ్మాయిల మనసు మార్చి ఇస్లాం మతంలోకి మార్చుతున్నారని అందులో చూపించారు. లవ్ జిహాద్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. కొన్ని ప్రభుత్వాలు ఈ సినిమా ప్రదర్శనను బ్యాన్ చేయగా...బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం ట్యాక్స్ కట్ చేశాయి.
Also Read: Maharashtra Crime: క్రికెట్ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు