Congress President Elections: కాంగ్రెస్ నూతన అధ్యక్ష్యుడు, గాంధీ కుటుంబేతరుడు - పదవి చేపట్టాలంటే ఈ అర్హతలు తప్పనిసరి
Congress New President: 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కేవలం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 41 సంవత్సరాలు గాంధీ కుటుంబమే అధ్యక్ష్య పదవిలో ఉంది.
Congress New President: ఓ వైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతుంటే.. మరోవైపు ఆపార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండటం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కేవలం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 41 సంవత్సరాలు గాంధీ కుటుంబమే అధ్యక్ష్య పదవిలో ఉంది. 17 మంది బయటి వారు అధ్యక్ష్య పదవి అధిరోహించారు. అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ఇదివరకే ప్రారంభం కాగా, సెప్టెంబర్ 30తో నామినేషన్లు ముగియనున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ప్రక్రియ ఇలా జరుగుతుంది..
వివిధ కమిటీలతో ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ. ఇందులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, ఆల్ ఇండియా కమిటీ అని ఉన్నాయి. ఈ కమిటీలన్నింటిలోనూ దాదాపు 1300 వరకు సభ్యులు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి 24మంది సభ్యులను ఎన్నుకుంటారు. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ లో మొత్తం దేశ వ్యాప్తంగా 30 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, 5 కేంద్రపాలిత కమిటీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 10వేల మందికి పైగా సభ్యులు ఉంటారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల కోసం ముందుగా సెంట్రల్ ఎలక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. మూడేళ్ల పదవీకాలం ఉండే ఈ అథారిటీలో ముగ్గురు నుంచి అయిదుగురు సభ్యులు ఉంటారు. అందులో ఒకరిని ఈ అథారిటీ చైర్ పర్సన్ గా నియమిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్‌గా ఉన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు అథారిటీ సభ్యులు పార్టీలో ఏ పదవిలోనూ ఉండరు. ఈ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ వివిధ రాష్ట్రాల్లోనూ ఎలక్షన్ అథారిటీలను ఏర్పాటు చేస్తుంది. వీరు మళ్లీ జిల్లా, బ్లాక్ ఎలక్షన్ అథారిటీలను ఏర్పాటు చేస్తారు.
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి 10 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అలా ఉన్నవారు ఎవరైనా సరే నామినేషన్ వేయవచ్చు.
- కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం, అధ్యక్ష పదవి ఎన్నికల కోసం మొదట రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ నే రిటర్నింగ్ అధికారిగానూ ఉంటారు.
- ఏ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులైనా అధ్యక్ష పదవికి ఒక పేరును ప్రతిపాదించవచ్చు. అయితే, కనీసం 10 మంది సభ్యులు ఉమ్మడిగా ఆ వ్యక్తిని ప్రతిపాదించాల్సి ఉంటుంది.
ఇలా ప్రతిపాదించిన పేర్లను రిటర్నింగ్ అధికారి ముందు ఉంచుతారు. 7 రోజుల గడువులోగా ఎవరైనా తమ పేరును వెనక్కు తీసుకునే అవకాశం కూడా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఒక్క అభ్యర్థి మాత్రమే మిగిలి ఉంటే, వారిని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ప్రకటిస్తారు.
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో లెక్కింపు మొదలు..
AICC కి బ్యాలెట్ బాక్సు వచ్చిన తర్వాత రిటర్నింగ్ అధికారి ఎదుట ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న ఓట్లను లెక్కిస్తారు. అందులో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోతే, అందరి కన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. ఈ రకమైన 'ఎలిమినేషన్' పద్ధతి ద్వారా అధ్యక్ష పదవికి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చివరికి, ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని అధ్యక్షుడు/ అధ్యక్షురాలుగా ప్రకటిస్తారు.
నామినేషన్ల ప్రక్రియ..
కాంగ్రెస్ చరిత్రలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు చాలా తక్కువ సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్ లో అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ తేదీలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు. నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత, అక్టోబర్ 1న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. అక్టోబర్ 17న ఎన్నికల పోలింగ్ జరగుతుంది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజున విజేతని ప్రకటిస్తారు.
1947 లో దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఎక్కువ ఏళ్లు భారత్ ని పాలించిన పార్టీగా కాంగ్రెస్ కి ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఈ పార్టీలో ఎక్కువకాలం అధ్యక్షుని కొనసాగిన వారిలో సోనియాగాంధీ ముందుంటారు. 1998 నుంచి 2017 వరకు ఆమె దాదాపు 20 ఏళ్లు పార్టీని ముందుండి నడిపించారు. అనారోగ్య కారణాలతో 2017లో రాహుల్ గాంధీ ఆపార్టీ పగ్గాలు అందుకున్నా రెండేళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవడంతో మళ్లీ సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్షునిగా ఉండటానికి అంగీకరించకపోవడం, సోనియా వయసు, ఆరోగ్య పరిస్థితుల రీత్యా పోటీకి దూరంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తులను అధ్యక్ష పదవి వరించనుంది.
సవాళ్లను ఎదుర్కోక తప్పదు..
కొత్త అధ్యక్షుడి ముందు మాత్రం అనేక సవాళ్లు ఉన్నాయి. 2024 సాధారణ ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కూడా ఉంది. అక్కడ తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. గుజరాత్ ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలను చేజిక్కుంచుకోవాలి. అలాగే పార్టీ అంతర్గత విభేదాలను ఓ దారికి తీసుకురావాలి. అందర్ని ఒక్కతాటిపైకి తేవాలి. సీనియర్లు చాలా మంది వెళ్లిపోయారు. కొత్త రక్తం కొత్త టీం రావాలి. వారిని ఎన్నికలకు తయారు చేయాలి. మరోవైపు గాంధీ కుటుంబానికి విధేయతగా ఉంటూనే ఇవన్నీ చక్కదిద్దాలి. దాదాపు అశోక్ గెహ్లాట్ అధ్యక్ష్య పదవి చేపట్టడం దాదాపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతుండగా, శశిథరూర్ కు సైతం ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.. మరి ఏం జరుగుతోందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.