Kerala High Court : మహిళల శరీర ఆకృతిపై కామెంట్ చేసినా లైంగిక వేధింపులు చేసినట్టే - కేరళ హైకోర్టు కీలక తీర్పు
Kerala High Court : మహిళల శరీర ఆకృతిపై వ్యాఖ్యలు చేయడం కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.
Kerala High Court : దేశంలో వయసుతో సంబంధం లేకుండా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న వేళ.. ఓ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మహిళలను అనుచిత వ్యాఖ్యలతోనే కాదు వారి శరీరాకృతిపై కామెంట్స్ చేసినా లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటూ కోర్టు తేల్చి చెప్పింది. ఇది వారి గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళల శరీరాకృతి, రంగుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని సూచించింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కేరళ రాష్ట్క ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్ పై విచారించిన కేరళ హైకోర్టు.. తాజాగా ఈ తీర్పు వెలువరించింది.
Also Read : HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
కేసు ఏంటంటే..
కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వైధింపులకు పాల్పడ్డాడంటూ అదే సంస్థలో పని చేస్తున్న మహిళా స్టాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 నుంచి తనను అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతున్నాడని, అభ్యంతరకర మెసేజ్ లు, వాయిస్ కాల్స్ తో దూషిస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో పేర్కొనడంతో.. అతనిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసు కొట్టేయాలంటూ ఆ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను ఆమె అందం గురించి మాత్రమే మాట్లాడానని, దీన్ని లైంగిక వేధింపుల నేరంగా పరిగణించవద్దని ఆయన కోర్టును అభ్యర్థించాడు. కానీ అతని వాదనను తోసిపుచ్చిన కోర్టు.. మహిళల శరీరాకృతిపై కామెంట్స్ చేయడమూ లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. లైంగిక వేధింపుల ఘటనలో ఒక వ్యక్తిపై నమోదైన క్రిమినల్ కేసులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎ. బదరుద్దీన్ నేతృత్వంలోని న్యాయస్థానం తోసిపుచ్చింది. దాంతో పాటు ఆ వ్యక్తి వేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది. ఇక నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారికి ఇదే కేసు నమోదు చేయాలని సూచించింది.
నిందితుడి వాదనలతో ఏకీభవించని హైకోర్టు.. ఈ కేసులో ఆరోపించినట్లుగా ఈ వ్యాఖ్యలు స్పష్టంగా IPC సెక్షన్ 354A(1)(iv) కిందకు వస్తాయని నొక్కి చెప్పింది. అదేవిధంగా, పిటిషనర్ పదే పదే పంపిన సందేశాలు పంపడమనేది KP చట్టంలోని సెక్షన్ 120(o) ప్రకారం నేరంగా పరిగణించబడతాయని తెలిపింది. ఇది నేరమని, జరిమానా కూడా విధించవచ్చని చెప్పింది. నిందితుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Also Read : AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్