జీతమే తీసుకోని సీఎం ఫారిన్ ట్రిప్‌కి ఎలా వెళ్లారు, మమతాపై కాంగ్రెస్ ఫైర్
Mamata Banerjee: మమతా బెనర్జీ స్పెయిన్ ట్రిప్‌పై కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది.
Mamata Banerjee Spain Trip:
పెరుగుతున్న డెంగీ కేసులు..
I.N.D.I.A పేరుతో ఏర్పడిన కూటమిలో చివరి వరకూ అన్ని పార్టీలు కలిసుంటాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఈ కూటమిలో ఉన్న పార్టీల నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌కి మధ్య ఏదో ఓ విషయంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండి పడ్డారు. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతుంటే అది పట్టించుకోవడం మానేసి స్పెయిన్ ట్రిప్‌కి వెళ్లారంటూ విమర్శించారు. ఆమె స్పెయిన్‌కి వెళ్లడం తప్పేమీ కాదని, కానీ రాష్ట్ర ప్రజల బాధనూ అర్థం చేసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఇటీవల G20 డిన్నర్‌కి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని పిలవకపోవడంపై అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే అసహనంతో ఉన్నారు. పైగా...ఆ డిన్నర్‌కి మమతా బెనర్జీ వెళ్లడాన్నీ తప్పుబట్టారు. ఇప్పుడు దీదీ స్పెయిన్ ట్రిప్‌పైనా విమర్శలు చేశారు.
"ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో పశ్చిమ బెంగాల్‌లో డెంగీ కేసులు పెరుగుతాయని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. మమతా బెనర్జీ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. ఆమె స్పెయిన్‌కి వెళ్లడం తప్పు కాదు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలిగా"
- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ
అంత డబ్బెక్కడిది..?
రోజుకి రూ.3 లక్షలు ఖర్చు పెట్టి మరీ అక్కడి హోటల్‌లో ఉండేంత అవసరం ఏముందని, అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు అధిర్ రంజన్. ఆమె జీతమే తీసుకోలేదని విన్నామని అలాంటి వ్యక్తి అంత ఖరీదైన గదుల్లో ఎలా ఉంటున్నారో అంటూ సెటైర్లు వేశారు.
"ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు జీతమే తెలుసుకోరని విన్నాం. ఆమె రాసిన పుస్తకాలు, గీసిన పెయింటింగ్స్ విక్రయించి ఆ డబ్బుతోనే గడుపుతున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తి స్పెయిన్‌లో రూ.3 లక్షల ఖరీదు చేసే హోటల్ గదుల్లో ఎలా ఉంటున్నారు..? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఈ లగ్జరీ ట్రిప్‌కి ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. అందులో కనీసం 10% అయినా రాష్ట్రం కోసం ఖర్చు పెట్టి ఉంటే చాలా మంది యువతకు ఉద్యోగాలు వచ్చేవి. ప్రజల్ని మోసం చేయకండి. స్పెయిన్‌లో ఏ కంపెనీలతో భేటీ అయ్యేందుకు మమతా వెళ్లారో చెప్పాలి"
- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ
ఖర్గేని పిలవని డిన్నర్‌కి మమతా ఎందుకు వెళ్లారంటూ గతంలోనూ అధిర్ రంజన్ అసహనం వ్యక్తం చేశారు. ఆమె ఆ విందుకి హాజరై ప్రధాని మోదీ ముందు లోకువైపోయారని విమర్శించారు. ఆమె వెళ్లకపోయినా వచ్చే నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు.
"రాష్ట్రపతి విందుకి ఆమె హాజరు కాకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. ఆకాశం విరిగి కింద పడిపోదుగా. మహాభారతం, ఖురాన్ అపవిత్రం అయిపోతాయా..? ఆమె ఈ విందులో పాల్గొనడానికి వేరే ఏమైనా కారణం ఉందేమో అని అనుమానంగా ఉంది. డిన్నర్‌లో ఆమె యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రహోం మంత్రి అమిత్‌షా పక్కనే కనిపించారు. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు డిన్నర్‌కి వెళ్లలేదు. కానీ మమతా బెనర్జీ మాత్రం చాలా హడావుడిగా వెళ్లిపోయారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ఆహ్వానం అందకపోయినా ఆమె వెళ్లడం వెనక ఉద్దేశమేంటి..?"
- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ
Also Read: India Canada News: భారత్‌తో బంధం మాకెంతో కీలకం, కానీ.. - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్