Public Examination Bill: పేపర్ లీకేజీపై కేంద్రం కొత్త చట్టం - పార్లమెంట్ ముందుకు ప్రత్యేక బిల్లు, ఎప్పుడంటే?
Central Government New Bill: పోటీ పరీక్షలు, ముఖ్య పరీక్షల పేపర్ లీకేజీల సమస్యలు పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది.
Public Examination Bill to Reduce Paper Leakage: పేపర్ లీకేజీ సమస్యలను పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5న (సోమవారం) లోక్ సభలో జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ (Public Examination Bill) బిల్లును ప్రవేశపెట్టనుంది. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వ విద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షల సమయంలో సమస్యల పరిష్కారించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. పేపర్ లీకేజీ వంటి విషయాల్లో నిందితులుగా తేలిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ జరిమానా విధించేలా చట్టంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది . అలాగే, 10 ఏళ్ల వరకూ జైలు శిక్షతో కూడిన జరిమానాలు విధించేలా బిల్లులో ప్రతిపాదిస్తోంది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసేలా మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమైన పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వల్ల పరీక్షలు రద్దై అటు నిరుద్యోగులు.. ఇటు ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం చర్యలు చేపట్టింది. కాగా, రాజస్థాన్ లోని టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, హర్యానాలోని గ్రూప్ - డీ పోస్టులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ), గుజరాత్ లో జూనియర్ క్లర్క్స్ రిక్రూట్మెంట్ పరీక్ష, బీహార్ లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష, తెలంగాణలో గ్రూప్ - 1 పరీక్ష (TSPSC) ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో ఆయా పరీక్షలను రద్దు చేశారు. ఇక, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు చట్టాన్ని రూపొందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం పార్లమెంటులో ప్రస్తావించారు.