Calcutta High Court: వేరు కాపురం పెడదామని భార్య వేధిస్తుంటే భర్త విడాకులు ఇవ్వొచ్చు - హైకోర్టు కీలక తీర్పు
Calcutta High Court: తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భార్య వేధిస్తే.. అతడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.
Calcutta High Court: తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉందామంటూ భర్తను భార్య మానసికంగా వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. వేధింపులకు గురి చేయడమే కాకుండా సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుండి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. అలాంటి భార్య నుండి విడాకులు కోరవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. భారతీయ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులతో ఉండటంతో పాటు వారిని పోషించడం కొడుకు బాధ్యత అని, అది మన సంస్కృతి, సాంప్రదాయంలో ఓ భాగమని జస్టిస్ ఉదయ్ కుమార్, జస్టిస్ సౌమెన్ సేన్ ల బెంచ్ పేర్కొంది.
తనకు తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఇలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పశ్చిమ మిడ్నాపూర్ కు చెందిన ప్రశాంత్ కుమార్ మండల్ కు 2001లో ఝార్నాతో వివాహం జరిగింది. ప్రశాంత్ ఓ పాఠశాలలో పార్ట్ టైం టీచర్ గా పని చేస్తున్నాడు. దాంతో పాటు బయట ట్యూషన్లు చెబుతుండే వాడు. తనకు వచ్చిన సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అయితే అరకొర సంపాదనతో తల్లిదండ్రులతో ఉన్న ఆ కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం సరిపోయేది కాదు. దీంతో భార్య వేరు కాపురం ఉందామంటూ ప్రశాంత్ పై ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టింది. ఈ విషయంపై గొడవలూ జరుగుతుండేవి. ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఝార్నా అతనిపైనా, అత్తమామలపైనా వేధింపుల కేసు పెట్టింది.
ఆ కేసు వల్ల ప్రశాంత ప్రభుత్వ ఉద్యోగం పొందలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ తనకు విడాకులు ఇప్పించాలంటూ మిడ్నాపూర్ లోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన కోర్టు ప్రశాంత్ కు, ఝార్నాకు 2009లో విడాకులు మంజూరు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఝార్నా కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ప్రశాంత్ కు అనుకూలంగా ఆమె పిటిషన్ ను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
భర్త అంగీకారం లేకున్నా విడాకులకు అప్లై చేసుకోవచ్చు
కొన్ని రోజుల క్రితం కేరళ కోర్డు ముస్లిం మహిళల విడాకుల విషయమై సంచనల తీర్పు ఇచ్చింది. భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవడానికి భర్త అనుమతి అవసరం లేదని కోర్టు పేర్కొంది. వివాహాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసే ముస్లిం మహిళ హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సీఎస్ డయాస్‌లతో కూడిన ధర్మాసనం ఓ కేసులో 59 పేజీల తీర్పును ఇచ్చింది.
"భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ మహిళలకు భర్త భరణం కూడా ఇవ్వాలి. భర్త అంగీకరించకున్నా కులా విధానాన్ని అమలు చేయవచ్చు. ముస్లిం మహిళ ఎప్పుడైనా తన వివాహ బంధాన్ని బ్రేక్ చేయవచ్చు. పవిత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీకరిస్తుంది. భర్త అంగీకారం ఉన్నా లేకున్నా విడాకులు తీసుకోవచ్చు." -కేరళ హైకోర్టు