Birbhum Violence: బీర్భూమ్ బాధితులకు దీదీ సాయం- 5 లక్షల పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం
బంగాల్ బీర్భూమ్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులను పరామర్శించిన సీఎం మమతా బెనర్జీ పరిహారం ప్రకటించారు.
బంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను సీఎం మమతా బెనర్జీ పరామర్శించారు. ఈ ఘటనలో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా ఒక్కొక్క కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee meets the kin of those killed in #Birbhum violence. Visuals from Bagtui village, Rampurhat pic.twitter.com/iIhSQjLpu8
— ANI (@ANI) March 24, 2022
మృతుల్లో ఇద్దరు బాలలు కూడా ఉండటంతో వీరికి అదనంగా రూ.50,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని దీదీ అన్నారు. దుండగులు దహనం చేసిన ఇళ్ళను పునర్నిర్మించుకోవడానికి రూ.2 లక్షలు చొప్పున ఇస్తామన్నారు.
కఠిన చర్యలు
ఈ హింసాత్మక ఘటనను ఆపలేకపోయిన సీనియర్ పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మమతా అన్నారు. ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
మోదీ సీరియస్
ఈ హత్యాకాండను అతిక్రూరమైన ఘటనగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. దర్యాప్తునకు అవసరమైతే సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిని అసలు క్షమించకూడదని మోదీ అన్నారు.
దారుణం
రాంపుర్ హట్ పట్టణానికి సమీపంలో ఉన్న బగ్టుయి గ్రామంలో దుండగులు మంగళవారం హింసాకాండకు పాల్పడ్డారు. ఓ ఇంటిలో ఉన్న ఎనిమిది మందిని సజీవ దహనం చేశారు. అంతకుముందు వీరిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ హింసాకాండలో దాదాపు 12 ఇళ్ళను తగులబెట్టారు. టీఎంసీ నేత భడు షేక్ హత్యానంతరం ఈ హింసాకాండ జరిగింది.
ఈ కేసులకు సంబంధించి పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. షేక్‌ను హత్య చేయడానికి బాంబు దాడి చేసిన వ్యక్తి కూడా అరెస్టయినవారిలో ఉన్నాడు. ఈ హింసాకాండలో మరణించినవారి మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, మొదట వీరిని తీవ్రంగా కొట్టి, హింసించి, ఆ తర్వాత సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలలు ఉన్నారు.
Also Read: Hijab Row: 'హిజాబ్' అంశాన్ని సంచలనం చేయొద్దు- అత్యవసర విచారణకు సుప్రీం నో
Also Read: Ukraine Russia War: అణ్వాయుధాల వినియోగంపై రష్యా సంచలన వ్యాఖ్యలు- అమెరికా సీరియస్