EPFO Big Decision: ఈపీఎఫ్‌ఓలో భారీ మార్పులు.. వేతన పరిమితి పెంచనున్న కేంద్ర ప్రభుత్వం
Salary Limit for PF | EPFO కొత్త జీతాల పరిమితి పెరగడంతో, లక్షలాది మంది ఉద్యోగులు PF, పెన్షన్ కవరేజీలోకి వస్తారు. జీతాల పరిమితి ఎంత పెరగవచ్చో తెలుసుకోండి.

EPFO Salary Limit: దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. EPFOతో అనుసంధానమైన ఉద్యోగులు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. PF ఖాతా ఆ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పొదుపు ఖాతా లాగా పనిచేస్తుంది. ప్రతి నెలా బేసిక్ శాలరీలో జరిగే చిన్న కోత భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం EPFOకి సంబంధించిన నిబంధనలను మారుస్తూనే ఉంది. ఇది కోట్లాది మంది PF ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. EPFOలో చేరడానికి, అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ లో చేరడానికి శాలరీ పరిమితిని పెంచాలని చూస్తున్నారు.
జీతాల పరిమితిని పెంచేందుకు సన్నాహాలు
ఇప్పుడు ఈపీఎఫ్‌వోలో ఈ పరిమితిని పెంచాలని యోచిస్తున్నారు. కొత్త పరిమితి అమల్లోకి వస్తే, కోటి మందికి పైగా ఉద్యోగులు రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ సెక్యూరిటీ పరిధిలోకి వస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా జీతాల విధానంలో మార్పులొచ్చాయి. పాత నిబంధనలు ఇప్పుడు ఉద్యోగుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. అందుకే ఈపీఎఫ్‌ఓ జీతాల పరిమితిని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిమితి ఎంత పెరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
శాలరీ లిమిట్ ఎంత పెరుగుతుంది?
ప్రస్తుతం, EPFOలో తప్పనిసరిగా చేరడానికి వేతన పరిమితి రూ. 15000 గా ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం, కార్మిక శాఖ దీనిని పెంచాలని తీవ్రంగా యోచిస్తోంది. కొత్త మార్పుల ప్రకారం ఈ పరిమితిని రూ. 25000 వరకు పెంచే అవకాశం ఉంది. అలా జరిగితే, 15000 కంటే కొంచెం ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్న, ప్రస్తుతం EPF, EPS కవరేజీకి దూరంగా ఉన్న ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగకరం. పరిమితి పెరిగిన వెంటనే వారు నేరుగా EPFO పరిధిలోకి వస్తారు.
మొదటిసారిగా EPF, EPS ప్రయోజనాలు
దీనివల్ల రిటైర్‌మెంట్ పొదుపు, పెన్షన్ రెండింటిలోనూ ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం ఉంటుంది. పరిమితిని ఒకేసారి రూ. 10000 పెంచడం వల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు మొదటిసారిగా EPF, EPS ప్రయోజనాలను పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రస్తుత ఆదాయ-ఖర్చుల ప్రకారం పాత పరిమితి రూ. 15000 ఇప్పుడు అంతగా ఉపయోగపడటం లేదు. అందుకే ఈ పరిమితిని పెంచడం చాలా అవసరం.
ఉద్యోగులకు ఎంత వరకు ప్రయోజనం
EPFOలో చేరినప్పుడు, ఉద్యోగి బేసిక్ శాలరీ (Basic Salary)లో 12 % EPFలో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని కంపెనీ యజమాని అంటే ఉద్యోగి కంపెనీ యాజమాన్యం కూడా ఇస్తుంది. జీత పరిమితి పెరగడం అంటే రెండింటి సహకారం కూడా పెరుగుతుంది. దీనివల్ల EPF బ్యాలెన్స్ వేగంగా పెరుగుతుంది. రిటైర్‌మెంట్ సమయంలో వీరికి ఎక్కువ ఫండ్ లభిస్తుంది. దీనితో పాటు, పెన్షన్ కవరేజ్ కూడా పెరుగుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో వారిపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే కంపెనీల వ్యయం ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ దీనిని ఉద్యోగుల ప్రయోజనానికి తీసుకున్న పెద్ద చర్యగా కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం EPFOలో 7.6 కోట్ల మంది యాక్టివ్ సభ్యులు ఉన్నారు. ఈ పరిమితి పెరగడం వల్ల చాలా మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.






















